వరకట్న వేధింపుల కేసులో ప్రభుత్వ వైద్యుడి అరెస్ట్‌ | Government Doctor Arrest in Extra Dowry Demand Case | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపుల కేసులో ప్రభుత్వ వైద్యుడి అరెస్ట్‌

Published Thu, May 2 2019 1:08 PM | Last Updated on Thu, May 2 2019 1:08 PM

Government Doctor Arrest in Extra Dowry Demand Case - Sakshi

తూర్పుగోదావరి  ,అమలాపురం టౌన్‌: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సూరిశెట్టి విద్యాసాగర్‌పై వరకట్నం, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆయన భార్య సూరిశెట్టి మణిక ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ సీఐ కోలా రజనీకుమార్‌ దర్యాప్తు చేశారు. దీంతో డాక్టర్‌ విద్యాసాగర్‌ను సీఐ రజనీకుమార్‌ ఆ రెండు సెక్షన్ల కింద బుధవారం అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచారు. ఇదే కేసులు నిందితులుగా ఉన్న డాక్టర్‌ విద్యాసాగర్‌ తల్లిదండ్రులు ఉన్నారు. వారిని అరెస్ట్‌ చేయాల్సి ఉంది. డాక్టర్‌కు కోర్టు 14 రోజల రిమాండ్‌ విధించడంతో డాక్టర్‌ను సబ్‌ జైలుకు తరలించారు. ఈ కేసు సంబంధించిన వివరాలను సీఐ రజనీకుమార్‌ వివరించారు. ప్రస్తుతం అమలాపురంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్నున్న విద్యాసాగర్‌ పట్టణంలోని ఎస్‌ఎస్‌ నాయుడు లే అవుట్‌లోని సాయిరామ్‌ ఫ్లాజాలో నివసిస్తున్నారు. బాధితురాలైన డాక్టర్‌ భార్య అయిన మణిక ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... వీరికి 2014 మే 24న విశాఖలోని దసపల్లా హోటల్‌లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు రూ.పది లక్షల నగదుతో పాటు విశాఖ మహానగరంలో పలు చోట్ల మూడు ఇళ్ల ప్లాట్లు, కొంత భూమి కట్నంగా ఇచ్చారని భార్య మణిక ఫిర్యాదులో పేర్కొంది.

డాక్టర్‌ విద్యాసాగర్‌ కట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ కాబోయే తన భార్య పేరున రాసి ఇస్తేనే వివాహం చేసుకుంటానని మెలిక పెట్టడంతోపాటు ఒత్తిడి కూడా తేవడంతో మణిక తల్లిదండ్రులు వరకట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ రాసి ఇచ్చారు. వారి వివాహమైన తర్వాత వారి కాపురం ఏడాది పాటు సజావుగా సాగింది. తర్వాత తన భర్త చెడు అలవాట్లు, మద్యానికి బానిసై అదనపు కట్నం కోసం వేధించారని పేర్కొంది. తన పేరున ఉన్న కట్నంగా ఇచ్చిన ఆస్తులను తన పేరున రాయాలని భర్తే కాకుండా ఆయన తల్లిదండ్రులు కూడా తనను నిత్యం వేధించారని ఆ ఫిర్యాదులో వివరించింది. చివరకు తన పేరున ఉన్న ఆస్తులను పెద్దల తగువులో తన పేరున, భర్త పేరున రాసేందుకు నిర్ణయించారు. ఇంతలో గత మార్చి నెలలో తన భర్త విద్యాసాగర్‌కు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉద్యోగం రావడంతో పట్టణంలో కాపురం పెట్టామని, నెల రోజులు తనను బాగానే చూసుకున్నారని మణిక పేర్కొంది. పది రోజుల క్రితం తమకు ఉన్న ఓ ప్లాట్‌ను అమ్మేద్దామని.., తనపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారని, అంతే కాకుండా అప్పటికే ఆయన ఒత్తిడితో అమ్మేసిన రెండు ప్లాట్ల సొమ్ముతో వేరే చోట కొత్త ప్లాట్‌ కొన్నానని తనను నమ్మించారే తప్ప దానిని తనకెప్పుడు చూపించలేదని ఫిర్యాదులో తెలిపింది. ఇదిలా ఉండగా గత నెల 28న పట్టణంలోని వారి వసతి ఇంట్లో ప్లాట్‌ అమ్మే విషయంలో భార్యభర్తలకు వాగ్వివాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఘటనలో డాక్టర్‌ విద్యాసాగర్‌ భార్య మణికి పీక నొక్కేసి తలను నేలనేసి కొట్టి చంపే ప్రయత్నం చేశాడన్న అభియోగంపై డాక్టర్‌పై అదనపు కట్నం కోసం  వేధింపులు, హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు సీఐ రజనీకుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement