
పార్వతీపురంలో పోలీసులు పట్టుకున్న భారీ ఖైనీ, గుట్కా తయారీ ముడిసరుకు (ఫైల్)
పార్వతీపురం: ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నా.. అధికారులు వరుస దాడులు చేస్తున్నా.. గుట్కా వ్యాపారం ఆగడం లేదు. పైపెచ్చు విచ్చలవిడిగా గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో సైతం నిషేధిక ఖైనీ, గుట్కాలు లభిస్తున్నాయంటే వ్యాపారం ఏ రేంజ్‌లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
2013 జనవరి పదో తేదీన ఖైనీ, గుట్కాలను ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఈ నిషేధమే అక్రమార్కులకు వరంగా మారింది. తక్కువ సరుకుకు ఎక్కువ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో చట్ట వ్యతిరేకమని తెలిసినా లాభాలకు అలవాటు పడిన వ్యాపారులు ఖైనా, గుట్కా వ్యాపారాలను మానుకోలేకపోతున్నారు.
అడపా దడపా పోలీసులకు చిక్కినా కొద్ది రోజుల్లో మళ్లీ పాత బాణినే పాడుతున్నారు. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత మొదట్లో పార్వతీపురం పట్టణానికి చెందిన ముగ్గురు, నలుగురు గుట్టుగా ఈ వ్యా పారం చేస్తున్నారు. అయితే పోలీసుల దాడుల నేపథ్యంల వారు వ్యాపారం మానేసినా..
ఇతరులు ఈ వ్యాపారంపై దృష్టి సారించడంతో చాపకింద నీరులా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. పార్వతీపురం పట్టణంతో పాటు మక్కువ, సాలూరు, బొబ్బిలి, చినమేరంగి, వీరఘట్టం, తదితర ప్రాంతాలకు సరుకును సరఫరా చేస్తున్నారు.
మదుపు తక్కువ...మిగులు ఎక్కువ
పార్వతీపురం పట్టణానికి పక్కనే ఒడిశా రాష్ట్రం ఉండడం.. అక్కడకు వెళ్లేందుకు రైలు, బస్సు సదుపాయాలు పుష్కలంగా ఉండడం వ్యాపారులకు బాగా కలసివస్తోంది. ఒడిశాలో సరుకు కొనుగోలు చేసి సాయంత్రం సమయంలో రైల్లో తిరిగి పార్వతీపురం చేరుకుంటున్నారు.
తెచ్చిన సరుకును రహస్యంగా ఒక చోట ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా లైన్ వ్యాపారుల(సైకిల్‌పై అమ్మేవారు)తో మార్కెట్‌లోని పాన్‌షాపులు, కిరాణా షాపులకు చేరవేస్తున్నారు. గతంలో రూపాయికి దొరికే 5000, సఫారీ, డీలక్స్ గుట్కాలు నేడు రూ. 4 నుంచి ఐదు రూపాయలు పలుకుతున్నాయి.
నాలుగు రూపాయలుండే మానిక్‌చంద్ గుట్కా ప్రస్తుతం 12 రూపాయలు.. రెండు రూపాయలకు దొరికే ఖైనీ రూ. 12కు విక్రయిస్తున్నారంటే వ్యాపారులకు లాభాలు ఎలా వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment