అనిత కుటుంబం
మండ్య: మోక్షం లభిస్తుందంటూ నమ్మించి ఓ క్షుద్రపూజల మాంత్రికురాలు దేశరాజధానిలో ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన తరహాలోనే హిజ్రా మాంత్రికురాలు ఓ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోవాలంటూ వేధించిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. మండ్య తాలూకాలోని మారగౌడనహళ్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళ కుటుంబానికి కొద్ది రోజుల క్రితం మైసూరు నగరానికి చెందిన క్షుద్రపూజలు చేసే మాంత్రికురాలైన హిజ్రా పరిచయమైంది. తమ కుటుంబంలో ఎదరుయ్యే ప్రతీ సమస్యకు పరిష్కారం కోరుతూ అనితా భర్త తరచూ హిజ్రాను ఆశ్రయించేవారు.
దీంతో సదరు కుటుంబ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న హిజ్రా సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసం దేవుడిని తలచకుంటూ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడాలంటూ అనితా భర్తకు సూచించింది. ఇదే విషయాన్ని వ్యక్తి తన కుటుంబ సభ్యులకు కూడా తెలుపగా మొదట భర్త వాఖ్యలను అనిత కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు. అయితే మోక్షం సిద్ధించాలంటే సామూహిక ఆత్మహత్యకు పాల్పడాలంటూ హిజ్రా అనిత కుటుంబ సభ్యులపై రోజురోజుకు ఒత్తిడి తీవ్రతరం చేస్తుండడంతో అనిత మాంత్రికురాలి నుంచి వస్తున్న వేధింపులపై హుణుసూరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యత్నించారు. అయితే అనిత ఫిర్యాదు గురించి పట్టించుకోని హుణుసూరు పోలీసులు అనితను బయటకు గెంటివేయడంతో తమ సమస్య గురించి అనిత ప్రసార మాధ్యమాలను ఆశ్రయించారు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం హిజ్రా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment