
విద్యార్థిని గాయిత్రి మృతదేహం
చిత్తూరు ,మదనపల్లె టౌన్ : వినాయక చవితి పండుగ సంబరాల కోసం ఇంటికి వచ్చిన ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ..బి.కొత్తకోట మండల కేద్రంలోని తాకాటంవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, గౌరమ్మ దంపతుల కుమార్తె సి.గాయిత్రి(17) స్థానికంగా మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గ్రామంలో వినాయక చవితి పండుగ సంబరాలలో పాల్గొనేందుకు ఈ నెల ఒకటిన గాయిత్రి ఇంటికి వచ్చింది. మూడు రోజులుగా ఈ విద్యార్థిని తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు బి.కొత్తకోటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో బాధ భరించలేక ఆ విద్యార్థిని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయిత్రి మృతి చెందింది. ఎంతపనిచేశావు తల్లీ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బి.కొత్తకోట పోటీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment