
సాక్షి, ప్రత్తిపాడు: తమను మోసం చేసిన జనసేన పార్టీ కార్యకర్తపై తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఆటో కార్మికులు శనివారం ఫిర్యాదు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. గణేష్ మాటలు నమ్మి రూ.లక్ష ఇరవై వేలు చొప్పున చెల్లించి ఫైనాన్స్ కంపెనీల నుండి డ్రైవర్లు ఆటోలు కొనుగోలు చేశారు.
మామిడాడలో శరకణం గణేష్ పెట్టిన ప్లెక్సీ
బాధితులు చెల్లించిన సొమ్ములతో జన సైనికుడు గణేష్ ఉడాయించాడు. ఈఎంఐలు చెల్లించాలని ఆటో ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిళ్ళు రావడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు గణేష్ చేసిన అన్యాయంపై ఆందోళనకు దిగారు. గణేష్‌తో పాటు ఆటో ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గృహ నిర్మాణాలకు కూడా సబ్సిడీ వస్తుందని సొమ్ములు వసూలు చేసినట్లు గణేష్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో అతడి మాటలు నమ్మి 200 మందిపైగా మోసపోయినట్టు తెలుస్తోంది. జనసేన పేరు చెప్పి తమను నిలువునా ముంచిన గణేష్‌ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి: బాధితులు
జనసేన పార్టీ కార్యకర్త గణేష్ చేతిలో మోసపోయిన తమకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. జనసేన పార్టీని చూసే తాము డబ్బులు కట్టామన్నారు. గణేష్‌తో పాటు జిల్లా నాయకులు వచ్చి తమను నమ్మించారని వాపోయారు. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారని వెల్లడించారు. (చదవండి: పవన్ పర్యటనలో టీడీపీ నేతలు)
Comments
Please login to add a commentAdd a comment