బాధితుడు శివశంకర్
బంజారాహిల్స్: రాంగ్‌రూట్‌లో ఎందుకు వస్తున్నావంటూ ప్రశ్నించినందుకు ఓ యువకుడిపై కొంత మంది యువకులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్ సమీపంలోని జవహర్‌నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద కొందరు యువకులు రాంగ్‌రూట్‌లో బైక్‌పై వస్తుండగా పాదాచారులతో పాటు ఇతర వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. రాంగ్‌రూట్‌లో వస్తే ప్రమాదాలు జరుగుతాయని స్థానికంగా నివసించే జోమాటో డెలివరీ బాయ్ శివశంకర్(22) వారిని మందలిస్తూ నిలదీశాడు.
దీంతో సదరు యువకులు మద్యం మత్తులో శివశంకర్‌పై కత్తులు,రాడ్లు, ట్యూబ్‌లైట్లతో దాడి చేసి గాయపర్చారు. ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. వారి నుంచి తప్పించుకునేందుకు శివశంకర్ తీవ్రంగా యత్నించాడు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడి కొట్టారు. సుమారు గంటపాటు సాయిబాబా టెంపుల్‌చౌరస్తాలో యువకుల మధ్య ఘర్షణ ఉధ్రిక్తతకు దారి తీసింది. స్థానికులు ఆపేందుకు యత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పరారీ కాగా పోలీసులు రాత్రంతా గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment