
సాక్షి, విజయవాడ : భూమి అమ్మకం పేరిట ఓ వ్యక్తి దుర్గా ట్రస్ట్‌కు కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందని నమ్మ బలికి ట్రస్ట్‌ను మోసం చేసి కటకటాలపాలయ్యాడు. పలు కేసుల్లో నిందితుడైన కేసినేని రమేశ్ అలియాస్ నవీన్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా అఖిల భారత భవానీ పీఠం నుంచి డబ్బులు కాజేశాడు.
ఈ పీఠానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు అందజేశారు. మోసాన్ని గ్రహించిన ట్రస్ట్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు పాత నేరస్థుడేనని గుర్తించారు. గతంలో అతనిపై అనేక ఛీటింగ్ కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నారు.