బస్సు కింద విగతజీవిగా యువకుడు
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): పద్మవ్యూహం వంటి ట్రాఫిక్‌ను తప్పించుకోలేక, ట్రాఫిక్ నియమాలు తెలియక, ఇరుకైన రోడ్డులో చిక్కుకుని బస్సు చక్రాల కింద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలను కలచివేసింది. కాశీబుగ్గ రాజీవ్‌గాంధీ బస్‌స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం 5గంటలకు గుర్తుతెలియని యువకుడు అత్యంత ట్రాఫిక్ రద్దీకి ఆందోళన చెందాడు. ఇదేక్రమంలో వస్తున్న పలాస–నువ్వలరేవు ఆర్డినరీ ఆర్టీసీ బస్సు పక్క నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా, ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడిపోయాడు.
పలాస ఆర్టీసీ డిపోకు చెందిన ఈ బస్సు నుడుంపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడాడు. ప్రయాణికులు 108 అంబులెన్సులో పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఉదయం నుంచి కాశీబుగ్గ బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతుండగా కొంతమంది కొట్టారని, ఈ క్రమంలో టెన్షన్‌తో తిరుగుతున్నాడని ఇంతలో ప్రమాదానికి గురయ్యాడని కాశీబుగ్గ పోలీసులకు స్థానికులు వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చివరకు ప్రయత్నించినా...
108 సిబ్బంది రమణ, సత్యం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడి ప్రాణాలు కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో సిబ్బంది తెలియజేశారు. అంతలో నర్సులు సీపీఆర్ (కార్డీయో పల్మనరీ రిస్సెస్టేషన్) విధానాన్ని ప్రయోగించి గుండెపై నెట్టారు. ఈ క్రమంలో ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించినా ప్రయోజనం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment