
మాతయ్య మృతదేహం
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గురుకులంలో చదువుతున్న కొడుకుని చూసి తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతున్న ఓ వ్యక్తి మండల పరిధిలోని పండ్లూరు జాతీయ రహదారి కూడలి వద్ద ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి హఠాన్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కోట మండలం లక్ష్మయ్యకండ్రిగ గ్రామానికి చెందిన కె.మాతయ్య (35) ఆదివారం తన భార్యతో కలిసి దొరవారిసత్రంలో ఉన్న గురుకులంలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి గ్రామానికి బయలుదేరారు. తాను ఇంటికి మళ్లీ వస్తానని భార్యను నాయుడుపేటలో బస్టాండ్‌లో కోట బస్సు ఎక్కించాడు.
అనంతరం మాతయ్య ఒక్కడే బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో పండ్లూరు జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చేసరికి గుండెనొప్పిగా ఉందని బైక్‌ను రోడ్డు పక్కన నిలిపాడు. కొద్దిసేపటికే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మాతయ్య మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మాతయ్య మృతిచెందినట్లు తెలుసుకున్న భార్య, అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment