
సాక్షి, వరంగల్ అర్బన్, ఎల్కతుర్తి: కలిసి పనిచేసిన చోట దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన ఓ యువతి పెళ్లి ఆగిపోయింది. ఫేస్‌బుక్‌లో ఫొటోల కారణంగా తన పెళ్లి నిలిచిపోయిందని మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది.
తోటి ఉద్యోగి మల్లెబోయిన ప్రశాంత్ తనతో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల తన వివాహం నిలిచిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఎస్సై టీవీఆర్ సూరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తితో ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో యువతి వివాహం జరగాల్సి ఉంది. కానీ యువతితో కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను ఆదివారం ఉదయం ప్రశాంత్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం కారణంగా పెళ్లి రద్దయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment