మృతి చెందిన సుస్మిత, రోదిస్తున్న తల్లి మిలకమ్మ
ప్రొద్దుటూరు క్రైం : ఒక్కగానొక్క కుమార్తె.. పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగింది.. ప్రభుత్వ ఉద్యోగమంటే వెంటనే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు.. అయితే డబ్బు వ్యామోహంతో భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ వేధింపులను భరించలేక ఆమె ఉరి వేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రొద్దుటూరులోని మిట్టమడివీధికి చెందిన పగిడికాల్వ సుస్మిత (23) శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లెకు చెందిన క్రిష్టఫర్, మిలకమ్మ దంపతులకు కుమార్తె సుస్మిత, కుమారుడు సందీప్ ఉన్నారు.
ఆమెకు 9 నెలల క్రితం ప్రొద్దుటూరులోని సేల్స్‌ట్యాక్స్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న సునీల్‌తో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు రూ.6 లక్షల నగదు, 10 తులాల బంగారు కట్నకానుకలుగా ఇచ్చారు. కొన్ని రోజులపాటు అతను భార్యను బాగా చూసుకున్నాడు. తర్వాత మద్యానికి బానిసై వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పి బాధ పడేది. ‘ఎలాగోలా సర్దుకొని పోమ్మా’ అని వారు చెప్పేవారు. వారం రోజుల క్రితం బంధువుల వివాహం ఉండటంతో సుస్మిత ఎర్రగుంట్లకు వచ్చిందని, అదే చివరి చూపు అవుతుందనుకోలేదని తల్లిదండ్రులు రోదించారు.
తెల్లవారుజామున ఫోన్ వచ్చింది
శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకున్న సుస్మితను కుటుంబ సభ్యులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. కాగా తెల్లవారుజామున 4.30 గంటలకు సునీల్ ఫోన్ చేసి ‘మీ కుమార్తె చనిపోయింది.. వెంటనే రావాలి’ అని అత్తామామలకు సమాచారం అందించాడు. దీంతో తల్లిదండ్రులతోపాటు బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు వచ్చారు. విగత జీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి వారు బోరున విలపించారు. ‘పెళ్లై ఏడాదైనా కాలేదు.. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ’ అంటూ తల్లి రోదించింది. తమ కుమార్తెను భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తన బిడ్డ బంగారు, డబ్బును కాజేశారని, ఉన్న ఆస్తిని కూడా బంధువులకు రాయించే ప్రయత్నం చేస్తుంటే సుస్మిత అడ్డు చెప్పిందని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారు వివరించారు.
డీఎస్పీ విచారణ
సుస్మిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి జిల్లా ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. ఈ సంఘటన ఎలా జరిగిందని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తల్లి మిలకమ్మ ఫిర్యాదు మేరకు సుస్మిత భర్త సునీల్, అత్త, ఆడపడచుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment