ముగ్గురు ఎక్కితే ముప్పే! | Most Accidents In Triple Riding in hyderabad | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఎక్కితే ముప్పే!

Published Thu, Nov 22 2018 9:36 AM | Last Updated on Thu, Nov 22 2018 9:36 AM

Most Accidents In Triple Riding in hyderabad - Sakshi

మెట్టుగూడ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందిన యువకులు (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: ‘టూ వీలర్‌ ఫర్‌ టూ ఓన్లీ’... మోటారు వాహనచట్టం స్పష్టం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం రాజధానిలో సాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ నిత్యం ప్రమాదాల బారినడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున మెట్టుగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో పాతబస్తీలో ఒకరు, ఫిబ్రవరిలో గుడిమల్కాపూర్‌లో ముగ్గురు ట్రిపుల్‌ రైడింగ్‌కే బలయ్యారు. 

మృతులు, బాధితుల్లో యువతే ఎక్కువ...
సాధారణంగా టూ వీలర్స్‌ వినియోగించే వారిలో యువతే ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలబారిన పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. వీరు స్నేహితులతో కలిసే ఎక్కువగా ట్రిపుల్‌ రైడింగ్‌కు పాల్పడుతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్‌ పోలీసులు కనిపించినా... జంక్షన్‌ వచ్చినా... ఆఖరులో కూర్చున్న యువకుడు తక్షణం దిగిపోయి నడుస్తూ ముందుకు వెళ్లడం పరిపాటి. ఇలా చేస్తూ ట్రిపుల్‌ రైడర్లు అనేక సందర్భాల్లో పోలీసులను పక్కదారి పట్టించడమేగాక తరచూ ప్రమాదాలకు లోనవుతున్నారు. 

వాహనం అదుపు చేయడం అసాధ్యం...
ప్రతి వాహనానికీ దానిని తయారు చేసే కంపెనీ కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగానే టూ వీలర్‌ను కేవలం ఇద్దరు వినియోగించడానికి వీలుగానే రూపొందిస్తుంది. ముందు డ్రైవర్, వెనుక పిలియన్‌ రైడర్‌ మాత్రమే ప్రయాణించాలంటూ తమ నిబంధనల్లో స్పష్టం చేస్తుంది. దీనికి సాంకేతికంగానూ ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

ఇంజన్‌ కెపాసిటీ
మోటారు వాహనాల్లో ప్రతి ఇంజన్‌కూ ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. దీనినే సాంకేతికంగా ఇంజన్‌ కెపాసిటీ అంటారు. ఆ వాహనం ఎందరు ప్రయాణించడానికి అనువుగా రూపొందిస్తారో... అదే సామర్థ్యంలో ఇంజన్‌ అభివృద్ధి చేస్తారు. నిర్దేశించిన ప్రయణికుల కంటే ఎక్కువ మంది ఆ వాహనంపై ప్రయాణిస్తే దాని ప్రభావం ఇంజన్‌పై పడుతుంది.

యాక్సిలరేటింగ్‌ కెపాసిటీ: ఓ వాహనం ఎంత వేగంతో దూసుకుపోవాలనేది స్పష్టం చేసేదే యాక్సిలరేటింగ్‌ కెపాసిటీ. సదరు వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు ఈ కెపాసిటీ తగ్గుతుంది. సాధారణంగా గంటకు 60 కిమీ వేగంతో దూసుకుపోయే వాహనం ఇలాంటప్పుడు 40 కిమీ మించదు. ఈ ప్రభావం ఓవర్‌టేకింగ్‌ తదితర సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది. 

బ్రేకింగ్‌/బ్యాలెన్సింగ్‌ కెపాసిటీ:ఏదైనా వాహనం ప్రమాదానికి లోనుకాకుండా ఉండాలంటే ఈ రెండూ అత్యంత కీలకం. సరైన సమయానికి బ్రేక్‌ వేయగలగటం, అవసరమైన స్థాయిలో బ్యాలెన్స్‌ చేసుకోవడం తప్పనిసరి. అయితే ట్రిపుల్‌ రైడింగ్‌ వంటివి చేసినప్పుడు ఈ ప్రభావం ఈ రెండు కెపాసిటీల పైనా పడి... ఎదురుగా ముప్పును గుర్తించినా తక్షణం స్పందించి వాహనాన్ని ఆపలేరు.  

కఠిన చర్యలు అవసరం
ప్రస్తుతం నగరంలో డ్రంక్‌ డ్రైవింగ్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం వంటివి చేస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు కౌన్సిలింగ్‌ తర్వాతే అప్పగిస్తున్నారు. అనేక సందర్భాల్లో కోర్టుల్లోనూ అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. యువతను బలి తీసుకుంటున్న ట్రిపుల్‌ రైడింగ్‌ విషయంలోనూ ఇలాంటి కఠిన చర్యలు అవసరం. డ్రంక్‌ డ్రైవర్ల విషయంలో అనుసరిస్తున్న మాదిరిగా కుటుంబీకులతో కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విధానం అవలంభించాలి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ట్రిపుల్‌ రైడింగ్‌ను అదుపు చేయడానికి కుటుంబీకుల సహకారం కూడా ఎంతో అవసరం.   – రవాణా రంగ నిపుణులు

ప్రత్యేక డ్రైవ్స్‌ చేపడుతున్నాం
నగరంలో ట్రిపుల్‌ రైడింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాం. దీనికోసం స్పెషల్‌ టీమ్స్‌ కూడా రంగంలోకి దిగాయి. ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ చిక్కిన వారికి జరిమానా విధించడంతో పాటు అక్కడిక్కడే ట్రాఫిక్‌ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఈ ఉల్లంఘన వల్ల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. వీటిలో భాగంగా ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ చిక్కిన వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకోవడం, వారికి ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో (టీటీఐ) సమగ్ర కౌన్సిలింగ్‌ తర్వాతే జరిమానా కట్టించుకుని వాహనం తిరిగి ఇవ్వడం వంటి చర్యలు యోచిస్తున్నాం. ఉన్నతాధికారుల అనుమతి తర్వాత కార్యాచరణలో పెట్టే అవకాశం ఉంది.      – అనిల్‌కుమార్, ట్రాఫిక్‌ చీఫ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement