సాక్షి బెంగళూరు: నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’ సినిమా షూటింగ్‌లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డా మరణించారు. మృతులను చిన్నారి అయిషా ఖాన్ (5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు. నగరంలోని బాగలూరు వద్ద రణం సినిమా షూటింగ్ జరుగుతోంది. సుయేరా బాను తన ఐదేళ్ల చిన్నారితో కలసి షూటింగ్ చూసేందుకు వెళ్లింది. ఆ సమయంలో కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను దర్శకుడు తీస్తున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా సిలిండర్ పేలింది. తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడే ఉన్న తల్లీకూతుళ్లు మరణించగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఘటనా ప్రాంతానికి బాగలూరు పోలీసులు చేరుకుని మృతదేహాలను యలహంక ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన చిన్నారిని మరో ఆస్పత్రికి తరలించారు. రణం చిత్రంలో చిరంజీవి సర్జా, చేతన్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కనకపుర శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వి.సముద్రం దర్శకత్వం వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న నటుడు చేతన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకోగా పోలీసులు విచారణ చేపట్టారు.
చేతన్ మాట్లాడుతూ సిలిండర్ పేలుడు ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సహాయం ఉంటుందని చెప్పారు. గడిచిన రెండు రోజులుగా షూటింగ్‌లో పాల్గొన్నానని, శుక్రవారం జరిగిన షూటింగ్‌లో తనకు సీన్లు లేవని చెప్పారు. కారు బ్లాస్ట్ సీన్ ఉందనే విషయం మాత్రం తనకు తెలుసునని, మరో చిన్నారి గాయపడిఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసిందని, తనని పరామర్శిస్తానని తెలిపారు. పేలుడు తర్వాత షూటింగ్ నిలిపేసి మిగిలిన చిత్ర బృందం అక్కడి నుంచి పారిపోయారు. చిరంజీవి సర్జా వేరొక చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు మైసూరుకు తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment