మహిళను తన్నుతున్న ఎంపీపీ
ఇందల్వాయి(నిజామాబాద్ జిల్లా): అతడు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధి.. దాదాపు ఏడాది కింద ఓ మహిళకు తన ఇంటిని అమ్మాడు.. ఆమె డబ్బులన్నీ కట్టేసింది.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.. అయినా ఇంటిని స్వాధీనం చేయలేదు.. ఆ మహిళ ఇంటికెళ్లి నిలదీసినందుకు బలంగా కాలితో తన్నాడు! నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారానికి చెందిన ఇమ్మడి గోపి దాష్టీకమిదీ.
33 లక్షలకు అమ్మి.. 90 లక్షలు కావాలంటూ..
గోపి ధర్పల్లి ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇందల్వాయిలోని సర్వే నెం.1107లో 1,125 గజాల స్థలంలో రెండు పోర్షన్లతో కూడిన ఇల్లు (3–8–11/3) ఉంది. 11 నెలల క్రితం ఈ ఇంటితో సహా స్థలాన్ని గౌరారానికి చెందిన ఒడ్డె రాజవ్వ, గంగారాం దంపతులకు రూ.33.72 లక్షలకు విక్రయించాడు. విడతల వారీగా మొత్తం డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. నెల క్రితం ఇంటి చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు రాజవ్వ ఇసుక, ఇటుక తరలించగా.. గోపి అడ్డుకున్నాడు. రూ.90 లక్షలకు ఇంటిని అమ్మానని, మిగతా రూ.56 లక్షలు కడితేనే ఇంటిని స్వాధీనం చేస్తానని ఆయన అన్నట్లు రాజవ్వ, ఆమె కుమారుడు ఆరోపిస్తున్నారు. తాను మాజీ నక్సలైట్‌నని, తన చేతుల్లో అధికారం ఉందని, ఎవరూ ఏమి చేయలేరంటూ బెదిరించాడంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే సివిల్ తగాదాలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు సూచించడంతో బాధితులు స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులకు వద్దకు వెళ్లగా.. చివరకు ఎంపీపీపై బెదిరింపుల చట్టం కింద కేసు నమోదైంది.
చెప్పుతో కొట్టడంతో..
రాజవ్వ కుటుంబీకులు ఆదివారం తమ కులస్తులతో కలిసి ఇందల్వాయిలోని తాము కొన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. తాళం పగలగొట్టి లోపన ఉన్న వస్తువులు, వంట సామగ్రిని బయటకు పడేసి, తమకు న్యాయం చేయాలంటూ ఇంటి మందు బైఠాయించారు. ఈ క్రమంలో ఎంపీపీ గోపికి, రాజవ్వ కుటుంబీకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన రాజవ్వ గోపిని చెప్పుతో కొట్టింది. దీంతో అతడు రాజవ్వను కాలితో బలంగా తన్నాడు. కిందపడిన రాజవ్వ అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థల వివాదంపై వివరణ కోరగా ఎంపీపీ స్పందించేందుకు నిరాకరించారు.
మాకు ప్రాణ భయం ఉంది: రాజవ్వ
తమ వద్ద గోపి రూ.33 లక్షలు తీసుకొని, ఇంటిని, స్థలాన్ని అప్పగించడం లేదని రాజవ్వ పేర్కొంది. ‘‘నేను మాజీ నక్సలైట్‌ను.. నా చేతిలో అధికారం ఉంది. మీరు నన్ను ఏమి చేయలేరు అని బెదిరిస్తున్నాడు. అతడి నుంచి మాకు ప్రాణ భయం ఉంది. నా భర్త దుబాయిలో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటిని కొన్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలి’’అని ఆమె గోడు వెల్లబోసుకుంది.
గోపిని అరెస్ట్ చేయాలి
ఎంపీపీ దాడి విషయం తెలిసి వడ్డెర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి తదితరులు ఇందల్వాయికి చేరుకుని నిరసన తెలిపారు. ఎంపీపీపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గోపిని టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సోమవారం ప్రజాసంఘాలతో కలిసి ‘చలో ఇందల్వాయి’నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఇందల్వాయి బంద్‌కు పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment