సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్ధిని మధులిక(17) బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన భరత్.. ఈ నెల 6న కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మధులికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన మధులిక.. దాదాపు 15 రోజుల తర్వాత కోలుకుంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ప్రాణాపాయం లేదని, లోపలి గాయాలు తగ్గడానికి మరికొన్ని రోజులు ఇంటిపట్టునే ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అసలు ప్రాణాలతో బయటపడటమే కష్టమనుకున్న తమ కూతురి ప్రాణాలు కాపాడిన వైద్యులు దేవుళ్లంటూ మధులిక తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని దేవుని ప్రార్థించిన వందలాది మందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మధులిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకిదో పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాను ప్రాణాలతో బతికి బట్టకడతానని అసలు అనుకోలేదంటూ కంటతడిపెట్టుకుంది. తనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని దేవుడ్ని ప్రార్థించింది. ఇదిలా ఉంటే, భరత్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని మధులిక కుటుంబం డిమాండ్ చేస్తోంది. తన కూతురి లాంటి పరిస్థితి ఏ తల్లీదండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment