సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేయడం అంటే ఇదేనేమో! ఓ బ్యాంకు మేనేజర్ తాను పనిచేస్తున్న బ్రాంచ్‌ను నిలువుగా ముంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఎన్.కృష్ణఆదిత్య అదే బ్యాంకులో తన పేరిట సేవింగ్ ఖాతా తెరిచాడు. తన స్నేహితుడు నీరటి కృష్ణయ్య పేరుపై రూ.9 లక్షలతో ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) అకౌంట్ తెరిచాడు. ఈ బ్యాంకు పరిధిలో ఉన్న 77 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులను ఆన్‌లైన్ ద్వారా సేవింగ్ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతోపాటు ఓడీ అకౌంట్‌పై రూ.92 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ చేశాడు. 77 అకౌంట్లతో 24 మంది ఖాతాదారుల అనుమతి లేకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా డబ్బులను తన సేవింగ్ ఖాతాలోకి మళ్లించినట్టు బ్యాంకు రీజినల్ మేనేజర్ అంతర్గత విచారణలో బయటపడింది. ఇక్కడితో ఆగకుండా కృష్ణఆదిత్య 53 మంది పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి బ్యాంకు ఖాతాలు తెరిచాడు.
వీళ్ల ఖాతాలపై రూ.62 లక్షలను రుణాల పేరిట దండుకున్నాడు. దుర్గాభవానీ, జై భవానీ మద్యం దుకాణాలకు ఎలాంటి రుణ ష్యూరిటీ పత్రాలు లేకుండానే రూ.60 లక్షలు రుణాలు మంజూరు చేశాడు. గ్రూప్ ఆఫ్ కస్టమర్ల పేరుతో 11 మందికి అర్హత లేకున్నా క్రెడిట్ రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు నష్టం వచ్చేలా చేసినట్టు గుర్తించారు. అయితే, ఈ వ్యవహారం ఓ ఖాతాదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినట్టు ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్ తెలిపారు. తనకు సమాచారం లేకుండా తన అకౌంట్ నుంచి రూ.2 లక్షలను డ్రా చేసి కృష్ణఆదిత్య తన అకౌంట్‌లో వేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపగా మొత్తం కుంభకోణం బయటపడిందని దుర్గప్రసాద్ సీబీఐకి రెండు రోజుల క్రితం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కృష్ణ ఆదిత్య మొత్తం రూ.3.46 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు తేలిందన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీబీఐ హైదరాబాద్ రేంజ్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి బ్యాంక్ మేనేజర్ కృష్ణ ఆదిత్యతోపాటు క్యాషియర్ కమ్ క్లర్క్ లేళ్ల శశిధర్, తాత్కాలిక మేనేజర్ ఆరె సత్యం, అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్, సుజాత్ అలీ సిద్దిఖీ, ఇతడి స్నేహితులు మహ్మద్ అబ్దుల్ ఖలీముల్లా షబ్బీర్, మహ్మద్ జబీరుల్లాపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్
Published Sat, Dec 29 2018 3:54 AM | Last Updated on Sat, Dec 29 2018 3:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment