మాజీ లవర్‌ దురాగతం..భర్తతో కలిసి ఫిర్యాదు | Police case filed against Ex boyfriend accused of prostitution | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 23 2018 8:11 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

Police case filed  against Ex boyfriend accused of prostitution - Sakshi

సాక్షి, చిత్తూరు : మాజీ ప్రియుడి దురాగతాలపై ఓ మహిళ తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాప్‌ చేసి లొంగదీసుకుని, అనంతరం వ్యభిచారం చేయాలని బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో బాధితురాలు భర్తతో కలిసి పోలీసుల్ని ఆశ్రయించింది. శుక్రవారం చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో తన భర్తతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. వ్యభిచారంలోకి దిగాలని, లేకపోతే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ మాజీ ప్రియుడు బెదిరిస్తున్నాడని వాపోయింది.

వివరాల్లోకి వెళితే... చిత్తూరు దుర్గానగర్‌ కాలనీకి చెందిన పవన్‌, తాను చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నట్లు తెలిపింది. అయితే తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని, దీంతో బెంగళూరులో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న ప్రకాశ్‌తో తనకు వివాహం జరిపించారని వివరించింది. విధి నిర్వహణ నిమిత్తం తన భర్త బయట ప్రాంతానికి వెళ్లడంతో తాను పుట్టింటికి రావాల్సి వచ్చిందని పేర్కొంది. కళాశాల స్నేహితులు ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న పవన్‌.. తిరిగి స్నేహంగా ఉందామంటూ మాటలు కలిపాడని తెలిపింది.

అయితే తమ పాత ఫొటోలు డిలీట్‌ చేయాలంటే తనతో ఒకసారి గడపాలని లొంగదీసుకున్నాడని వాపోయింది. అనంతరం తాను చెప్పిన వాళ్లతో గడపకపోతే ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరిస్తుండడంతో విషయాన్ని తన భర్తకు తెలిపినట్లు వివరించింది. ఈ నెల 6న భర్తతో కలిసి చిత్తూరులోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలి భర్త ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో ఏ మహిళా బలి కాకూడదన్న ఉద్దేశంతో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చామని, తమకు న్యాయం చేయాలని కోరాడు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తే పవన్‌ దురాగతాలతో పాటు... చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement