సెల్‌షాపులో విచారిస్తున్న సీఐ రాజశేఖర్
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం) : స్థానిక విజయవాడ రోడ్డులోని ఓ సెల్ షాపులో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్ప డ్డారు. సెల్ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లు, రూ.20 వేల నగదు అపహరించుకుపోయారు. రోజూలాగానే గురువారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన సేల్స్ బాయ్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి యాజమాని షేక్ అబ్ధుల్ ఖలీల్‌కు తెలియజేశారు. హుటాహుటిన షాపునకు వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపులోని 12 సెల్ ఫోన్లు, రూ.20,710 నగదు అపహరణకు గురైనట్లు లెక్క తేలింది. దీంతో హనుమాన్‌జంక్షన్ పోలీసులకు సెల్ షాపు యాజమాని షేక్ అబ్ధుల్ ఖలీల్ ఫిర్యాదు చేయటంతో సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్‌ఐ కె.ఉషారాణి ఘటనాస్థలికి వచ్చి విచారించారు. సెల్ షాపు పక్కన సందులో ఉన్న మరో షట్టర్ తాళాలను దుండగులు చాకచాక్యంగా పగలుగొట్టి లోనికి ప్రవేశించినట్లు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో రికార్డు అయ్యింది. సుమారు 22 ఏళ్లు వయస్సు కలిగిన ముగ్గురు యువకులు ఈ చోరీకి పాల్పడినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. వీరు షాట్‌లు ధరించి, బ్యాగ్‌లు పట్టుకుని తిరుగుతున్నట్లుగా సీసీ కెమెరా ఫుటేజి ద్వారా పోలీసులు గుర్తించారు. కాగా రెండు, మూడు రోజులుగా సెల్ షాపు పక్క సందులో ఈ ముగ్గురు దుండగులు అనుమానాస్పదంగా తిరుగుతూ చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీ ఘటనపై హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ కె.ఉషారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment