
విశాఖ : విశాఖ జిల్లాలో పదవి విరమణ రోజే ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే లారీ కిందపడి ప్రాణం వదిలాడు. గాజువాక చిన్న గంట్యాడ కూడలిలో శనివారం జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది. గాజువాకకు చెందిన కేపీ నాయుడు సింహాచలం ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. శనివారం పదవి విరమణ పొందాల్సి ఉంది.
అయితే ఇంటి నుంచి బయలు దేరిన నాయుడు .. గంట్యాడ కూడలిలో లారీ వెనుక టైర్ కిందపడి మృతి చెందాడు.. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో నాయుడు లారీ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కేపీ నాయుడు ఈ ఘటనకు పాల్పడటంపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు...మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యలమంచిలి మండలం మర్రిబండ వద్ద టాటా ఎస్ వెహికల్, లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. టాటా వెహికల్ ను లారీ వెనుక నుంచి ఢీ కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతులిద్దరూ తూర్పుగోదావరి జిల్లా వీలుపూడి గ్రామానికి చెందిన రాంబాబు, యేసుబాబులుగా గుర్తించారు. వీరు కాయగూరల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో టాటా ఎస్ వెహికల్ డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. రెండు మృతదేహాలను మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.