సాక్షి, హైదరాబాద్: నిజాముద్దీన్‌లో తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. టోలిచౌకి సమీపంలోని హకీంపేట మజీదు వద్ద మలేషియాకు చెందిన హమీద్‌బిన్ జేహెచ్ గుజిలి, జెహ్రాతులామని గుజాలి, వారామద్ అల్ బక్రి వాంగ్, ఏబీడీ మన్నన్ జమాన్ బింతి అహ్మద్, ఖైరిలి అన్వర్ బాన్ అబ్దుల్ రహీం, జైనారియాలు తదితర ఆరుగురు మలేషియా వాసులు టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి న్యూఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తూ దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురు న్యూఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ హకీంపేటకు వచ్చి ఇక్కడ మసీదులో షెల్టర్ తీసుకున్నారు. మజీదు ఇన్‌చార్జి అనుమతితో రెండు రోజులుగా ఈ ఆరుగురు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలదాచుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమాచారం ఇవ్వకుండానే ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి సోదాలు నిర్వహించారు. వీరిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ 420, 269, 270, 188, 109, ఫారెనర్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరందరిని గాంధీలో క్వారంటైన్‌లో ఉంచారు. పోలీసులకు తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా తబ్లీగి జమాతేకు వెళ్లి వచ్చిన ఆరు మంది మలేషియన్లకు ఆశ్రయం కల్పించినందుకు హకీంపేట మజీదు ఇన్‌చార్జి మీద కూడా క్రిమినల్ కేసు నమోదైంది. (తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment