
సాక్షి, మానకొండూర్ : కోడికూర వండి పెట్టాలని గొడవ పడిన తండ్రిని తనయుడు బండ రాయితో మోది చంపాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భీమదేవరపెల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సయ్యద్ మదార్ (40) రెండు నెలల క్రితం బండరాయి కొట్టేందుకు శంకరపట్నం మండలం కొత్తగట్టులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్.. కోడి కూర వండి పెట్టాలని కొడుకు ఖాసీంతో గొడవ పడ్డాడు. లేకుంటే చంపుతానని బెదిరించాడు. నిత్యం తాగి వస్తున్న తండ్రి వేధింపులు భరించలేక అతణ్ని హతమార్చాలని ఖాసీం నిర్ణయించాడు. మంగళవారం అర్ధరాత్రి మదార్ నిద్రిస్తున్న సమయంలో బండరాయితో మోది హత్య చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.