
పుణే : డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం పలువురిని ఘోర రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తోంది. తాజాగా పుణేలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వాహన డ్రైవర్ తన ఎస్‌యూవీని వేగంగా నడపడంతో, అది అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓం ప్రకాశ్ పండిన్‌వార్(60) అనే వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు గాయాలు పాలయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకి సంఘ్వీ చౌక్‌లో ఈ ప్రమాదం జరిగింది.
హోటల్‌కు ఎదురుగా ఉన్న రోడ్డులో ఎస్‌యూవీ చాలా వేగంగా నడుపుకుంటూ వచ్చింది. ఆ సమయంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో, డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొన్న ఎస్‌యూవీ, రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. అలా దూసుకెళ్లిన ఎస్‌యూవీ క్యాష్ కౌంటర్‌లో ఉన్న పండిన్‌వార్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. అదే సమయంలో అతని భార్య, మరో వ్యక్తి కూడా అదే హోటల్‌లో ఉన్నారు. ఎస్‌యూవీ డ్రైవర్ కూడా గాయాల పాలయ్యాడని పోలీసులు చెప్పారు. పోలీసులు ప్రస్తుతం ఆ డ్రైవర్ ఎవరు? ఎస్‌యూవీ యజమాని ఎవరు? అని విచారిస్తున్నారు. హోటల్ పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఈ ప్రమాద వీడియో రికార్డైంది.