
న్యూఢిల్లీ: పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో కొడుతుంటే మూడు చక్రాల టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసిన వైనానికి సంబంధించిన వీడియో ఢిల్లీలో సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల వాహనం, టెంపో ఢీకొనడంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తమ సహోద్యోగుల్లో ఒకరి కాలిపైకి టెంపో (గ్రామీణ సేవ) చక్రం ఎక్కడంతో పోలీసులు డ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. ఆటోలో ఉన్న అతని కొడుకుని బయటకు లాగి కొట్టారు. దీనితో టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసి వారి వెంటపడ్డాడు. డ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం పరామర్శించారు. ఈ కేసులో నిందితుడికి తగిన న్యాయం జరిగేలా అమిత్ షా చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం అమరీందర్ కోరారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ఈ ఘటనను ఖండించారు.
ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
కాగా వీడియోలో ఉన్నట్టుగా గుర్తించిన ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీసు ప్రతినిధి అనిల్ మిట్టల్ చెప్పారు. కాగా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసుల నుంచి వివరణ కోరింది.