భీమారం(చెన్నూర్):రబీలో పండించిన ధాన్యాన్ని వర్షాలనుంచి కాపాడుకోబోయి పిడుగుపాటు గురై పలువురు రైతులు మరణిస్తున్నారు. ఇలా ఏడాదిలో నలుగురు చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో గత మేనెల 13న అదే గ్రామానికి చెందిన జాడి రమేశ్, రాంటెంకి రాజయ్య, ముడిపల్లి రాజం ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాల వద్దకు వెళ్లారు. అదే సమయంలో భారీవర్షం వచ్చింది. పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ ఏడాది మే నెలలోనే ఇదే మండలం పోలంపల్లిలో కౌలురైతు పోశం కుమారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేందర్ కూడా శుక్రవారం ఉదయం వర్షం రావడంతో ధాన్యం తడవకుండా.. కవర్లు కప్పేందుకు వెళ్లి పిడుగుపాటుతో మరణించారు. ఖరీఫ్‌లో వచ్చిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బంది పడని రైతులు రబీలో ఎండ ఉన్నా.. తేమశాతం పేరుతో ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
దీంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు అకాలవర్షాలతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సరం ఆరెపల్లిలో కౌలు రైతులు పండించిన ధాన్యం భీమారంలోని కేంద్రానికి తరలించకముందే ముందు జాగ్రత్తగా ఆరబెడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడటంతో ముగ్గురు కౌలు రైతులు అనంత లోకాలకు వెళ్లారు. అప్పట్లో ఆరెపల్లి సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. అప్పటి ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఆరెపల్లిలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చినా.. ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు. ఈ ఏడు కూడా ఆరెపల్లి రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమారం కేంద్రానికి తరలిస్తున్నారు.
పోలంపల్లి విషాదం
కౌలు రైతు కుమారుడు రాజేందర్ ఉన్నత విద్య అభ్యసించారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఉపాధ్యాయుడి నియామకమయ్యారు. ఈ క్రమంలో సెలువులు రావడంతో తండ్రికి బాసటగా ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో పిడుగు పడి ఇలా అర్థాంతరంగా అనంత లోకానికి పోవడంతో అతని కుటుంబం రోడ్డున పడినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment