లండన్ : తప్పతాగి విమాన సిబ్బందినే కాక.. తోటి ప్రయాణికులను కూడా ఇబ్బందులకు గురి చేసిన ఓ భారత సంతతి మహిళకు లండన్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది. వివరాలు.. కిరణ్ జాదవ్(41) అనే మహిళ ఈ ఏడాది జనవరిలో స్పెయిన్‌లోని టెనెరిఫే నుంచి బ్రిటన్‌కి ప్రయాణిస్తుంది. బోర్డింగ్‌కు నాలుగు గంటల ముందే కిరణ్ దాదాపు 6 - 8 బీర్లు.. విమానంలో మరో 6 గ్లాసుల వైన్ తాగింది. అంతటితో ఆగక మరింత మద్యం ఇవ్వాల్సిందిగా సిబ్బందిని కోరింది. కానీ వారు అందుకు నిరాకరించడంతో నానా యాగి చేసింది. కింద కూర్చుని బిగ్గరగా నవ్వుతూ, ఏడుస్తూ.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తిని పట్టుకుని గందరగోళం సృష్టించింది.
ఆ సమయంలో విమానంలో ఉన్న ఓ ఆఫ్ డ్యూటీ పోలీసధికారి కిరణ్‌ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అతడిని బూతులు తిట్టడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తా ఎగుడుదిగుడుగా ఉండటంతో విమానం కుదుపులకు గురయ్యింది. దాంతో కిరణ్ ‘మనం చనిపోబోతున్నాం’ అంటూ గొడవ చేయడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం (నిన్న) జరిగింది. విమానంలో తప్ప తాగి ఇతర ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను లండన్ కోర్టు కిరణ్ జాదవ్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment