
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం ఢిల్లీలో ఎయిర్‌హోస్టెస్ అనీసియా బత్రా ఆత్మహత్యకు ఆమె భర్త మయాంక్ చిత్రహింసలే కారణమని మృతురాలి ఫ్రెండ్ వెల్లడించారు. ఈ తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు తన భర్త ప్రవర్తనే కారణమని అనీసియా తనకు మెసేజ్ పంపారని ఆమె చెప్పారు. తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అనీసియా స్నేహితురాలు పలు వివరాలు తెలిపారు. భర్త తనను రూమ్‌లో బంధించాడని, పోలీసులకు కాల్ చేసేందుకు నీ సహకారం కావాలని.. వీలైతే తన వద్దకు రావాలని అనీసియా తనకు వాట్సాప్ మెసేజ్ చేశారని చెప్పారు.
మయాంక్ (భర్త) వైఖరితో విసుగెత్తి తాను చనిపోతున్నానని ఆమె చివరిగా మెసేజ్ చేశారని అనీసియా ఫ్రెండ్ తెలిపారు. ఆమె మరణానికి కొన్ని నిమిషాల ముందు తన భర్త తనను గదిలో బంధించి బయట తాళం వేశాడని చివరి మెసేజ్ చేశారని, ఆ పరిస్థితిలో ఆమె ఎంతగా భయకంపితురాలై, అసహాయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని బాధితురాలి తరపు న్యాయవాది ఇష్కరణ్ సింగ్ పేర్కొన్నారు. ఆమె బయటికి వచ్చి పోలీసులకు కాల్ చేసేందుకు ఎవరైనా సహకరిస్తారేమోనని ఆశగా వేచిచూశారని, ఇదే ఆమె మరణ వాంగ్మూలమని సింగ్ చెప్పుకొచ్చారు. జూన్ 27నే ముందస్తుగా బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని, అప్పుడే మయాంక్‌పై చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.