మృతదేహం వద్ద రోధిస్తున్న వినయ్ తల్లి, సోదరుడు , భార్యతో వినయ్ (ఫైల్)
‘సంతోషం తప్ప బాధ ఎలాంటిదో తెలియదు. మా అమ్మ కష్టపడి అలా పెంచింది. తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అమ్మకంటే ఎక్కువగా చూసుకున్నాను. అవతలి నుంచి ఇసుమంత ప్రేమ దొరకలేదు. దూరంగా పెడుతూ వేధించడం మొదలుపెట్టింది. సర్దుకుపోదామనుకున్నా. చివరకు నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మపై చేయిచేసుకునేంత వరకు వెళ్లా. అయినా, ఆమెలో మార్పు రాలేదు. తర్వాత ఆమె మా ఇంట్లోని సంతోషాన్ని తీసుకెళ్లేందుకొచ్చిందని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నన్ను తమ్ముడిలో చూసుకోండి అమ్మా..నాన్నా’ అంటూ సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి తమ్ముడికి పంపి రైలు కింద పడి తనువు చాలించాడు గోనెగండ్లకు చెందిన వినయ్‌కుమార్.
కర్నూలు/గోనెగండ్ల/ పత్తికొండ రూరల్/: కర్నూలు శివారులోని కార్బైడ్ ఫ్యాక్టరీ మెయిన్‌గేట్ వద్ద సోమవారం రాత్రి వినయ్‌కుమార్ (24) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గోనెగండ్ల పట్టణానికి చెందిన సుబ్రమణ్యంశెట్టి , విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వినయ్‌కుమార్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తమ్ముడు వంశీకృష్ణతో కలసి పత్తికొండలోని సాయిబాబా గుడి దగ్గర కిరాణం అంగడి నిర్వహిస్తున్నాడు. మేనమామ సొంతూరైన వెల్దుర్తిలో సౌజన్య అనే అమ్మాయిని ప్రేమించి నవంబర్ 1న పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే మరొక యువకుడితో ఆమె ప్రేమలో పడటంతో వినయ్‌కుమార్‌కు దూరంగా ఉంటోంది. పెళ్లి అయినప్పటినుంచి కూడా కాపురం చేయకపోగా విడాకులు కావాలని భర్తతో గొడవ పడేది. 20 రోజుల క్రితం ఇదే విషయంలో ఘర్షణపడి పుట్టింటికి చేరుకుంది. సోమవారం ఉదయం వినయ్‌కుమార్‌కు.. అత్త అమృతవల్లి ఫోన్ చేసి సౌజన్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపింది.
వెంటనే తమ్ముడు వంశీతో కలసి వచ్చి గాయత్రి ఎస్టేట్‌లోని ఆసుపత్రిలో భార్యను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ సమయంలో కూడా వారి మధ్య సంసార విషయమై గొడవ జరిగింది. సాయంత్రం తల్లితో కలసి సౌజన్య వెల్దుర్తికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన వినయ్‌కుమార్ మద్దూర్‌నగర్‌లో పని ఉంది.. చూసుకుని వస్తానంటూ తమ్ముడికి చెప్పి కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కీమెన్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో చేతులు, కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. షర్ట్ జేబులో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
శోకసంద్రంలో తల్లిదండ్రులు
వినయకుమార్ మరణ వార్త తెలియగానే తల్లిదండ్రులు, తమ్ముడు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లైన దంపతులు సుఖసంతోషాలతో ఉంటారనుకుంటే ఇలా జరిగిందం టూ వారు రోదిస్తున్న తీరు స్థానికుల ను కంటతడి పెట్టించింది. తర్వాత మృతదేహాన్ని గోనెగండ్లకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న ఆత్మహత్యకు వదిన, ఆమె కుటుంబసభ్యులే కారణమని వంశీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment