అత్యాచారయత్నం కేసులో పదేళ్ల జైలు
Published Thu, Dec 8 2016 12:03 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోనే ఐదేళ్లు
రూ. 2 వేలు జరిమానా
రాజోలు/రాజమహేంద్రవరం క్రైం : దళిత మైనర్ బాలికపై అత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు, జరిమానా విధించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి చెందిన పోతుల శ్రీనివాసరావు అలియాస్ శ్రీనుకు బాలికల అత్యాచార నిరోధక చట్టం(పీఓసీఎస్‌ఓ) ద్వారా ఐదేళ్లు జైలు శిక్ష, రూ.1000 జరినామా, దళిత బాలిక కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా మరో ఐదేళ్లు, రూ. 1000లు జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఫస్ట్‌క్లాస్ అడిషనల్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎ.వి.రవీంద్రబాబు బుధవారం తీర్పు చెప్పారు. రాజోలు ఎస్సై లక్ష్మణరావు తెలిపిన వివరాల మేరకు 2014 జనవరి 31వ తేదీన పొన్నమండ గ్రామానికి చెందిన నల్లి మోహన్‌దాస్ మైనర్‌కుమార్తెపై వృత్తి రీత్యా పంగిడి నుంచి పొన్నమండ వచ్చిన లారీ డ్రైవర్ శ్రీనివాసరావు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్సై అప్పన్న కేసు నమోదు చేయగా అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి కేసు విచారణ పూర్తి చేసి బాలికల అత్యాచార నిరోధక, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి డ్రైవర్ శ్రీనివాసరావును అరెస్ట్ చేసి రాజమండ్రి ప్రత్యేక కోర్టుకు తరలించారు. రెండు కేసులు రుజువు కావడంతో శ్రీనివాసరావుకు శిక్ష విధించారని ఎస్సై తెలిపారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ హసీనా బాధితురాలి తరుఫున కేసు వాదించారన్నారు.
Advertisement
Advertisement