కృషి, పట్టుదలతో ఐఏఎస్ సాధ్యమే
దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పద్మనాభరావు
తొర్రేడులో కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్ : ఐఏఎస్ చదవాలంటే కేవలం ఐఏఎస్, ఐపీఎస్, ధనికుల పిల్లలకు మాత్రమేనని అపోహలలో ఉన్నారని, కాని కృషి, పట్టుదలతో చదివితే ఎవరైనా సివిల్స్‌లో ర్యాంకు సాధించవచ్చని దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పద్మనాభరావు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ నాలుగో బ్రాంచిని తొర్రేడు గ్రామంలో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇంటర్, డిగ్రీ నుంచే సివిల్స్ శిక్షణ ప్రారంభించారు. అకాడమీ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డాక్టర్ పద్మనాభరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడని, అతను సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించాడన్నారు. 2016 సివిల్స్‌కు 11 లక్షల మంది దరఖాస్తు చేస్తే 4.5 లక్షలు మంది పరీక్ష రాశారని, అందులో 15 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు. ఇంటర్వ్యూలకు మూడు వేల మంది అర్హత సాధించగా, 1099 మంది సివిల్స్‌కు సెలక్ట్ అయ్యారని పద్మనాభం తెలిపారు. సివిల్స్‌లో ర్యాంకులు ఆధారంగా ఐఏస్‌తో పాటు, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ తదితర 24 గ్రూపులలో ఉద్యోగాలు సాధించ వచ్చన్నారు. సివిల్స్‌లో శిక్షణ పొందిన వారు గ్రూప్–1, గ్రూప్–2, బ్యాంకు పరీక్షలలోను విజయం సాధించవచ్చన్నారు. కృష్ణప్రదీప్స్‌అకాడమిలో ఇంటర్, డిగ్రీ నుంచి సివిల్స్‌కు శిక్షణ పొందడం వల్ల 22 ఏళ్లకే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించవచ్చన్నారు. ఆ వయస్సులో సివిల్స్ ఎంపిక కావడం వల్ల కేబినెట్ సెక్రటరీ హోదా వరకు పనిచేసే అవకాశం వస్తుందని పద్మనాభరావు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డు డిప్యూటీ డైరెక్టరు ఏవీవీడీఎం ప్రసాద్ మాట్లాడుతూ సివిల్స్‌లో మూడవర్యాంకు సాధించిన గోపాలకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్ధులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ మాట్లాడుతూ సోషల్, సైన్స్ చదవడం ద్వారా సివిల్స్‌తో పాటు, అంతర్జాతీయ, నాన్ గవర్నమెంటు సర్వీసులలో ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతి విద్యార్థి చదవుతోపాటు రైటింగ్ స్కిల్స్ మెరుగు పర్చుకోవాలని సూచించారు. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమి డైరెక్టర్ కృష్ణప్రదీప్ మాట్లాడుతూ 2003 నుంచి హైదరాబాద్‌లో ఐఏఎస్ అకాడమీని స్థాపించామని, అప్పటి నుంచి ప్రతి ఏడాది సుమారు 50 మంది సివిల్స్‌లో ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. మొదటి ప్రయత్నంలోనే విద్యార్థులు సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న ఉద్ధేశ్యంతోనే ఇంటర్, డిగ్రీతో సివిల్స్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ ఆచారి, «సీఈవో ధరణి, అకడమిక్ డైరెక్టర్ ఎస్‌వీ నారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.