సమస్యల ఒడి.. ‘ చిప్పకుర్తి’ బడి | 5clasess.. one class room | Sakshi
Sakshi News home page

సమస్యల ఒడి.. ‘ చిప్పకుర్తి’ బడి

Published Wed, Jul 27 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

సమస్యల ఒడి.. ‘ చిప్పకుర్తి’ బడి

సమస్యల ఒడి.. ‘ చిప్పకుర్తి’ బడి

  • 5తరగతులు... ఒకే తరగతి గది
  • పాఠశాలకు తాగునీరు లేదు..
  • మరుగుదొడ్ల సౌకర్యం కరువు..
  • పట్టించుకోని అధికారులు
  • రామడుగు : విద్యార్థులు లేక మూతపడిన పాఠశాల అది.. మళ్లీ తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో పాఠశాలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు రాళ్లబండి శశికళారెడ్డి గ్రామస్తుల సహకారంతో ఆ బడిని బతికించుకున్నారు. ఇంటింటికీ తిరిగి విద్యార్థులను సమీకరించారు. ఇంగ్లిష్‌మీడియం ప్రారంభించడంతో పక్క గ్రామాల విద్యార్థులు వచ్చి చేరారు. దీంతో పాఠశాల చిన్నారులతో కళకళాడుతోంది. అయితే సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రామడుగు మండలం చిప్పకుర్తి ప్రాథమిక పాఠశాల సమస్య వలయంగా మారింది.  
     
     
    చిప్పకుర్తి గ్రామంలో విద్యార్థులు ప్రై వేట్‌ పాఠశాలల వైపు మెుగ్గు చూపడంతో ప్రాథమిక పాఠశాలను మూసేశారు. మూడేళ్ల క్రితం బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు రాళ్లబండి శశికళారెడ్డి తిరిగి తెరిపించారు. పిల్లలు బడిలో చేర్పించే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆమెకు వారి సహకారం తోడవడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంగ్లిష్‌మీడియం ప్రవేశపెట్టడంతో సమీప గ్రామాల ప్రజలు తమ పిల్లలను చిప్పకుర్తికి పంపించడం ప్రారంభించారు. ఇప్పడు విద్యార్థుల సంఖ్య 74కు చేరింది. 
     
    వేధిస్తున్న సమస్యలు... 
    విద్యార్థుల సంఖ్య పెరిగిందనే ఆశ ఎంతోసేపు నిలవలేదు. కనీస సౌకర్యాలుకరువై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి, మరుగుదొడ్ల వసతి లేదు. తరగతి గదులు లేవు. 
    –పాఠశాలలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఒకటే తరగతి గది ఉంది. మరొకటి శిథిలావస్థకు చేరగా కూలగొట్టారు. దీంతో పిల్లలకు చెట్ల కిందనే చదువులు చెప్పాల్సి వస్తోంది. నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. వారు కనీసం కూర్చుండడానికి వసతి కూడా లేదు..
    – పాఠశాలలో నీటి వసతి లేదు. పాఠశాల ఆవరణలో మట్టిపోయడం బోర్‌వెల్‌ కూరుకుపోయింది. దానికి అదనపు పైపు బిగించాల్సి ఉండగా.. పట్టించుకునేవారులేరు.
    –వంట గదిపైకప్పు లేదు. దీంతో ఒక మూలకు వంట చేస్తున్నారు. 
    – మూడేళ్లుగా పాఠశాలకు అటెండర్‌ లేకపోవడంతో విద్యార్థులే అన్ని పనులు చేస్తున్నారు.
    –ప్రహరీ లేకపోవడంతో పశువులు పాఠశాల ఆవరణలోకి తిరుగుతున్నారు.
    – పాఠశాలకు అదనంగా తరగతి గదులను నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.50 లక్షలు మంజూరు చేసింది. వంటగది మంజూరైంది. అధికారుల పర్యవేక్షణలోపం అయినా ఇంకా పనులు ప్రారంభించలేదు. 
     
    తరగతుల నిర్వహణ ఇబ్బందిగా ఉంది
    ఎనిమిది తరగతులకు ఒక్కటే గది ఉంది. విద్యార్థులకు తాగునీటి వసతి కూడాలేదు. మరుగుదొడ్లు, మూత్రశాల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విన్నవించినా పరిష్కారం కనిపించడంలేదు. వసతులు కల్పిస్తే మరింత ఉన్నతంగా విద్యాబోధన చేయగలుగుతాం.
    –రాళ్లబండి శశికళారెడ్డి, హెచ్‌ఎం
     
    చదువు బాగా చెబుతున్నారు..
    పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం చెబుతున్నారని రామడుగు నుంచి చిప్పకుర్తికి ఆటోలో వస్తున్నాం. సార్లు పాఠాలు బాగా చెబుతున్నారు. పెద్దసార్లు పాఠశాలకు తరగతి గదులను నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది..
    –రిత్విహ, 5వ తరగతి విద్యార్థి
     
    రేకుల షెడ్డు కింద..
    తరగతి గది లేకపోవడంతో చెట్లు, రేకుల షెడ్డు కింద చదువుకోవాల్సి వస్తోంది. బడిలోకి పశువులు రావడంతో ఇబ్బంది కలుగుతోంది. మూత్రశాలలు లేకపోవడంతో చాలా బాధ పడుతున్నాం.
    – నిహారిక, 4వ, తరగతి విద్యార్థి
     
     

Advertisement
Advertisement