పెళ్లి లారీకి కరెంట్ షాక్ | 7 people dead in medak district, wedding lorry accident | Sakshi
Sakshi News home page

పెళ్లి లారీకి కరెంట్ షాక్

Published Sun, May 1 2016 11:11 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

పెళ్లి లారీకి కరెంట్ షాక్ - Sakshi

పెళ్లి లారీకి కరెంట్ షాక్

ఏడుగురి దుర్మరణం.. 15 మందికి గాయాలు
మెదక్ జిల్లా దెగుల్‌వాడి దేవ్‌లా తండా సమీపంలో ఘోర ప్రమాదం
వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో దుర్ఘటన
తృటిలో తప్పించుకున్న నవ దంపతులు

 
సాక్షి, సంగారెడ్డి/నారాయణఖేడ్/కంగ్టి: అప్పటిదాకా పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపారు.. అంతా కలిసి తిరుగు పయనమయ్యారు.. కానీ దారి కాచిన మృత్యువు వారిని కబళించింది.. విద్యుత్ తీగలు యమపాశాలై ఏడుగురి ప్రాణాలు తీశాయి. మృతుల్లో పెళ్లి కుమారుడి తండ్రి కూడా ఉన్నారు. నవ దంపతులు వీరి వెనుకే వేరే వాహనంలో రావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని దెగుల్‌వాడి దేవ్‌లా తండా సమీపంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా కంగ్టి మండలం చౌకన్‌పల్లి సమీపంలోని రాంసింగ్ తండాకు చెందినవారు.
 
ఐదు నిమిషాలైతే వెళ్లే వారు..
రాంసింగ్ తండాకు చెందిన శివ అనే యువకుడి వివాహం నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం నందివాడ సమీపంలోని ఓ గిరిజన తండాలో జరిగింది. వివాహం అనంతరం లారీలో బంధువులతో కలిసి వరుడి తరపు వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దెగుల్‌వాడీ దేవ్‌లా తండా సమీపంలోకి రాగానే కిందకు వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ వైర్లు లారీకి తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. మరో 15 మంది వరకు గాయపడ్డారు.

మృతిచెందిన వారిలో పెళ్లి కుమారుడి తండ్రి ధన్షీరాం (50), వినోద్ (25), శ్రీను (20), లవ్ (20), రాములు (45), అశోక్‌జాదవ్ (20) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన కిస్కిబాయి (25)ని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రథమ చికిత్స కోసం క్షతగాత్రుల్ని అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి  తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ దుర్ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. అప్పటి వరకు బాజాభజంత్రీలతో, చుట్టాలతో సందడిగా ఉన్న ధన్షీరాం ఇల్లు రోదనలతో నిండిపోయింది. తండా మొత్తం గొల్లుమంది.
 
మంత్రి హరీశ్ దిగ్భ్రాంతి
దెగుల్‌వాడి దేవ్‌లా తండా సమీపంలోని ప్రమాదంపై మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ సాయం  అందించేందుకు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని, మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. క్షతగాత్రులకు హైదరాబాద్‌లోని యశోద, కామినేని ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని హరీశ్‌రావు పురమాయించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement