ఇక పట్టణీకరణ!
మున్సిపాలిటీల పరిధి పెంపు
కొత్త నగర పంచాయతీల ఏర్పాటు
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు
మెట్‌పల్లి(కోరుట్ల) : కొత్త జిల్లాల్లో పట్టణ ప్రాంతాల పెంపుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాల విభజన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం వాటిలో పట్టణాల రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల పరిధిని పెంచడంతోపాటు కొత్తగా నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై విధివిధానాలను రూపొందించి వాటి ప్రకారం ప్రతిపాదనలను తయారు చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
జగిత్యాల జిల్లాలో 327 గ్రామ పంచాయతీలతో పాటు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. 9 మేజర్ గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో ప్రస్తుతమున్న మున్సిపాలిటీల పరిధి పెంచడంతో పాటు మేజర్ గ్రామాల్లోని రెండు లేదా మూడింటిని నగర పంచాయతీలుగా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీల పరిధి పెంచడానికి వాటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల విలీనం, 20 నుంచి 40వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చడానికి అవకాశాలను పరిశీలించాలని ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకు ఆదాయం, మౌళిక సదుపాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
మున్సిపాలిటీల్లో విలీనమయ్యే గ్రామాలు...
ప్రభుత్వం సూచన మేరకు మున్సిపాలిటీలో విలీనానికి అవకాశమున్న గ్రామాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. మెట్‌పల్లికి సంబంధించి పట్టణానికి సమీపంలో ఉన్న వెంకట్రావుపేట, ఆరపేట, వెల్లుల్ల, వేంపేట గ్రామాలను విలీనానికి ప్రతిపాదిస్తూ ఇటీవలనే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. కోరుట్ల మున్సిపాలిటీలో కిషన్‌రావుపేట, సంగెం, యెఖిన్‌పూర్, జిల్లా కేంద్రంగా ఉన్న జగిత్యాల మున్సిపాలిటీలో చల్‌గల్, ధరూర్, మోతె, తిమ్మాపూర్, తిప్పన్నపేట గ్రామాలను ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.
మేజర్ పంచాయితీల్లో అవకాశం ఎన్నిటికో..?
జిల్లాలో ఇబ్రహీంపట్నం, బండలింగాపూర్, వెల్లుల్ల, ఐలాపూర్, మల్లాపూర్, రాయికల్, మల్యాల, కొడిమ్యాల, ధర్మపురి మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. ఇవన్నీ 20వేల లోపు జనాభాను కలిగి ఉన్నాయి. నగర పంచాయతీల ఏర్పాటు కోసం జనాభా తక్కువగా ఉండి...పట్టణీకరణకు అవకాశమున్న వాటిలో అవసరమైతే సమీపంలోని చిన్న గ్రామాలను కలపాలని ప్రభుత్వం సూచించింది. దీని ప్రకారం అధికారులు జిల్లాలో కొత్త నగర పంచాయతీల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
విలీనాన్ని వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలపడం ద్వారా ప్రజలపై పన్నులభారం పెరగడంతోపాటు గ్రామీణ కూలీల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని కోల్పోవాల్సి ఉంటుందని సర్పంచ్‌లు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఆరపేట, వెంకట్రావ్‌పేట, వెల్లుల్ల, వేంపేట గ్రామాల విలీనానికి అనుకూలంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. దీనిని తాము అంగీకరించబోమంటూ ఆయా గ్రామాల సర్పంచ్‌లు సబ్‌కలెక్టర్ ముషారఫ్‌అలీని కలిసి విన్నవించారు. గ్రామాల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో ప్రజలతో కలిసి అందోళనలు చేపడుతామని వారు పేర్కొనడం గమనార్హం.