తీవ్ర రూపం దాల్చనున్న తుఫాన్!
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో 'రోను' తుఫాన్ ఉంది. నేడు తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అందింది. తీరం వెంబడి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చిరించారు.
వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారి శుక్రవారం ఒడిశా వైపుగా వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్‌లో తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం డివిజన్ లో అత్యధికంగా 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత మండలాల రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ అప్రమత్తం చేశారు. సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి.