సంక్షేమానికే ప్రాధాన్యం.. | Decisions on 13 items in TRS plenary | Sakshi
Sakshi News home page

సంక్షేమానికే ప్రాధాన్యం..

Published Thu, Apr 28 2016 4:11 AM | Last Updated on Mon, Sep 17 2018 7:53 PM

సంక్షేమానికే ప్రాధాన్యం.. - Sakshi

సంక్షేమానికే ప్రాధాన్యం..

టీఆర్‌ఎస్ ప్లీనరీలో 13 అంశాలపై తీర్మానాలు
 
 సుమారు నాలుగున్నర గంటల పాటు చర్చ
♦ కరువుపై కేంద్రం కనికరించాలని విజ్ఞప్తి
♦ నివేదికలో పేర్కొన్నవి 15 తీర్మానాలు.. ప్లీనరీలో ప్రవేశపెట్టినవి 13
♦ మిషన్ కాకతీయ, ఐటీ-పారిశ్రామిక విధానాలపై కేవలం చర్చ
 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవంలో 13 అంశాలపై తీర్మానాలు చేశారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే... కరువుపై కేంద్రం కనికరించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమం, భారీ నీటిపారుదల, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్, వ్యవసాయం, విశ్వనగరంగా హైదరాబాద్, విద్యుత్, కేజీ టు పీజీ, కృష్ణా పుష్కరాలు, శాంతిభద్రతల పరిరక్షణ, విభజన చట్టం హామీలు, అనావృష్టి, నీటిఎద్దడి నివారణ, తెలంగాణ హరితహారం, పారిశ్రామిక విధానం-ఐటీ పాలసీ అంశాలపై చర్చించారు. ప్లీనరీ ఉదయం 10.35 గంటలకు ప్రారంభం కాగా... 11.55 నుంచి మధ్యాహ్నం 1.36 వరకు, భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.20 వరకు తీర్మానాలపై చర్చించారు. అయితే తొలుత ప్లీనరీ ప్రణాళికలో 15 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నా... 13 తీర్మానాలనే ప్రవేశపెట్టారు. మిషన్ కాకతీయ, ఐటీ పారిశ్రామిక విధానంపై సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, మంత్రులు ఇతర అంశాల్లో భాగంగా మాట్లాడారు. కానీ తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టలేదు.
 
 తొలి తీర్మానం సంక్షేమం
 ప్లీనరీలో తొలుత సంక్షేమ రంగంపై తీర్మానాన్ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రతిపాదించారు. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కొని కూడా సంక్షేమానికి రూ.35వేల కోట్లను ఖర్చు పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ఆదాయపరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షలకు పెంచామని చెప్పారు. తమ ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున బియ్యం ఇస్తూ కడుపునిండా అన్నం పెడుతోందన్నారు. కల్యాణలక్ష్మి, హాస్టళ్లకు సన్నబియ్యం పథకాలతో దేశానికే ఆదర్శనీయంగా నిలిచామని చెప్పారు.ఈ తీర్మానాన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బలపరిచారు.
 
 విశ్వనగరంగా హైదరాబాద్
 హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘విశ్వనగరంగా హైదరాబాద్-రాష్ట్రంలో పట్టణాభివృద్ధి’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. దేశంలో ప్రస్తుతం హైదరాబాద్ 5వ పెద్ద నగరమని.. భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి... రూ.4,051 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామన్నారు. 8,024 కిలోమీటర్ల పొడవునా రోడ్లను మెరుగుపరచడానికి రూ.337 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ తీర్మానాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బలపరిచారు.
 
 కోటి ఎకరాల మాగాణం
 గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులను నిర్మించి... రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ‘గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.. మేజర్ ఇరిగేషన్‌తో పసిడి సిరులు పండాలి’ అంటూ రెండో తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. టీఆర్‌ఎస్ పురుడు పోసుకున్న మొదట్లోనే జలసాధన ఉద్యమం చేశామని... నదులు, వాగులు, వంకలు సహా ప్రతిచుక్క నీటిపై సీఎం కేసీఆర్ 20 నెలలు అధ్యయనం చేశారని తెలిపారు. కాళేశ్వరం, ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతలు, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ తీర్మానాన్ని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేత జితేందర్‌రెడ్డి బలపరిచారు.
 
 ఇంటింటికీ మంచినీరు..
 ‘ఆరోగ్య తెలంగాణ రక్షణ చక్రం.. మిషన్ భగీరథ సుజ ల చక్రం’ అనే అంశాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా... ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు. 20 ఏళ్ల క్రితమే ఆడబిడ్డలు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులను చూసి సిద్దిపేటలో ఇంటింటికి నీరిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథతో 2017 డిసెంబర్ నాటికి 90 శాతం గ్రామాలకు తాగునీటిని అందించాలన్నది లక్ష్యమన్నారు.
 
 వ్యవసాయానికి ప్రోత్సాహం

 ‘పల్లెకు ఫలసాయం-తెలంగాణకు వ్యవసాయం’ అనే అంశాన్ని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని... గత ప్రభుత్వాలు చెల్లించని రూ.480.83 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఒకే విడతలో చెల్లించి రైతులను ఆదుకున్నదని చెప్పారు. తెలంగాణను విత్తన భాండాగారంగా రూపొందించడానికి కృషి చేస్తోందన్నారు. ఈ తీర్మానాన్ని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ బలపరిచారు.
 
 పేదలకు ఇళ్లు
 ‘పేదల ఆత్మగౌరవం.. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల పథకం’ అంశాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ ప్రతిపాదించారు. 150 గజాల స్థలంలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ మోడల్ కాలనీలో 375 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి, ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల ‘డబుల్’ ఇళ్లను ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ బలపరిచారు.
 
 నిరంతర విద్యుత్
 తెలంగాణ ఇప్పుడు వెలుగులు విరాజిల్లుతున్న రాష్ట్రంగా వర్ధిల్లుతోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తపస్సు నుంచి ఉషస్సు వైపు- తెలంగాణలో నిరంతర విద్యుత్’ అంశాన్ని ఆయన ప్రతిపాదించారు. విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నా ప్రజలపై చార్జీల భారం మోపని ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ అంశాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు.
 
 ఘనంగా కృష్ణా పుష్కరాలు
 ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలను మహబూబ్‌నగర్, నల్లగొం డ జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ‘కృష్ణా పుష్కరాలు-నదీమతల్లితో అనుబంధాలు’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించా రు. కృష్ణా తీరంలో 281 కిలోమీటర్ల పొడవునా పుష్కరాలు జరపనున్నామని.. ఈ పనులకు రూ.825.16 కోట్లను విడుదల చేశామని చెప్పారు. దీన్ని నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ బలపరిచారు.
 
 కరువుపై కనికరించండి..
 కరువు పరిస్థితుల నేపథ్యం లో కేంద్రం కనికరించి రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. ‘అనావృష్టి, నీటి ఎద్దడి.. నివారణ చర్యలు’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. కరువు నుంచి ఉపశమనం కోసం రూ.3,064.75 కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని, పెద్దగా స్పందన లేదని చెప్పారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి బలపరిచారు.
 
 ప్రతిష్టాత్మకంగా కేజీ టు పీజీ

 పేద వర్గాల వారు ఉన్నత చదువులు చదివేందుకు సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ విద్యను తీసుకువచ్చారని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘కేసీఆర్ మానసపుత్రిక కేజీ టు పీజీ గురుకుల విద్య’ అంశాన్ని ఆయన ప్రతిపాదించారు. అంబేడ్కర్ 125వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం 250 గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే వినయభాస్కర్  బలపరిచారు.
 
 శాంతిభద్రతలపై దృష్టి
 శాంతి భద్రతల పరిరక్షణ, గుడుంబా నిర్మూలన ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ‘శాంతి భద్రతల పరిరక్షణ, పేకాట, గుడుంబా  నిర్మూలన’ తీర్మానాన్ని ఆమె ప్రతిపాదించారు. శాంతిభద్రతల కోసం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రూ.275 కోట్లు ఖర్చుతో 4,433 వాహనాలను కొనుగోలు చేశామన్నారు. జిల్లాల్లోనూ 550 వాహనాలను కొనుగోలు చేశామని తెలిపారు. గ్రామాలు, తండాల్లో గుడుంబాను నిర్మూలించి పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్సీ రాములునాయక్ బలపరిచారు.
 
 విభజన హామీలు నెరవేర్చాలి
 రాష్ట్ర విభజన చట్టం హామీలను నెరవేర్చాలని, తెలంగాణలోని 119 అసెంబ్లీస్థానాలను 153కు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ... ‘విభజన చట్టం హామీలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి’ తీర్మానాన్ని ఎంపీ వినోద్‌కుమార్ ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. తెలంగాణ, ఏపీల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కోసం రైలు, రోడ్డు మార్గాలను చేపడతామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ, రామగుండంలో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ బలపరిచారు.
 
 జూన్ నుంచి హరితహారం
 జూన్  నుంచి హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ‘ప్రకృతి రమణీయం - తెలంగాణ హరితహారం’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. హరితహారం ముఖ్యమంత్రి మానసపుత్రిక అన్నారు. తెలంగాణలో 120 కోట్ల మొక్కలు నాటాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశమని.. 2015-16 బడ్జెట్‌లో దీనికి రూ.325 కోట్లు కేటాయించామని తెలిపారు. దీన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బలపరిచారు.
 
తీర్మానాలు చేయని అంశాలు..
  మిషన్ కాకతీయకు పెద్దపీట
 ప్లీనరీ ప్రణాళికలో ‘కాకతీయ జలకళ పునరుజ్జీవం-మిషన్ కాకతీయ బహు ప్రశంసనీయం..’ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దానిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రతిపాదించాల్సి ఉంది. కానీ దీనిని ప్లీనరీలో తీర్మానంగా ప్రవేశపెట్టలేదు. దీనిపై సీఎం కేసీఆర్ ప్రసంగంలో, మం త్రుల ప్రసంగాల్లో మాట్లాడారు.రెడ్డిరాజుల కాలం నాటి కాకతీయ చెరువులను తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వారు పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల కుట్రలతో చెరువుల పూడిక తీయకుండా నీరు నిల్వకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 45 వేల చెరువులను రూ.40వేల కోట్లతో పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
 
 ప్రపంచంలో ఉత్తమ విధానం
 ‘టెక్నాలజీకి జోడించిన మానవీయకోణం.. తెలంగాణ పారిశ్రామిక విధానం’ తీర్మానాన్ని ప్లీనరీ ప్రణాళికలో పేర్కొన్నా మంత్రి కేటీఆర్ దానిని ప్రతిపాదించలేదు. కానీ ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. టీఎస్ ఐపాస్‌తో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, పారిశ్రామికంగా యువత బలపడేందుకు చేయూతనిస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్‌పార్క్, వరంగల్ జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
 
 విదేశాల నుంచి ప్రతినిధులు
 టీఆర్‌ఎస్ ప్లీనరీకి లండన్, ఆస్ట్రేలియా నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. లండన్ శాఖ నుంచి అనిల్, ఆస్ట్రేలియా నుంచి బెరైడ్డి అనిల్ హాజరయ్యూరని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ టీఆర్‌ఎస్‌కు శాఖలున్నాయని.. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విదేశాల్లో చాలామంది ప్రశంసిస్తున్నారని చెప్పారు.

 పార్టీకి విరాళాలివ్వండి
 బంగారు తెలంగాణ కోరుకునేవారంతా రూ.100కు పైబడి టీఆర్‌ఎస్‌కు విరాళాలు అందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఒకనెల వేతనాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చారని చెప్పారు. విరాళాల విషయాన్ని టీఆర్‌ఎస్ కేంద్ర కమిటీ నేడో, రేపో ప్రకటిస్తుందని తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు కేడర్ ఉండాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 ఇండియాలో మనిషికి 28 చెట్లే..
 ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని కేసీఆర్ ప్లీనరీలో పేర్కొన్నారు. ‘‘ఇటీవల పారిస్‌లో 175 దేశాలు గ్లోబల్ వార్మింగ్‌పై సమావేశమయ్యాయి. ఉష్ణోగ్రతలను ఎలా తగ్గించాలి, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి అనే అంశాలపై అందులో చర్చించారు. కెనడాలో ఒక్క మనిషికి 8 వేల చెట్లు, రష్యాలో 4 వేల చెట్లు, అమెరికాలో 600 చెట్లు, చైనాలో 102 చెట్లు ఉంటే.. ఇండియాలో ఒక్కో మనిషికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మనమెలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు..’’ అని చెప్పారు. గతంలో ఉష్ణోగ్రతలు 37, 38 డిగ్రీలుంటే ఇప్పుడు 47 డిగ్రీలకు చేరాయని... దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. తెలంగాణలో హరితహారం కింద 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని సూచించారు.

 తలసాని స్థాయి తగ్గలే.. పెంచినం
 మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో ఎనిమిది రోజుల ముందే పోర్ట్‌ఫోలియో మార్పుపై చర్చించానని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘తలసాని ప్రజలతో సంబంధాలున్న నాయకుడు. పోర్టుఫోలియో మార్పుతో తలసాని స్థాయి తగ్గలేదు.. పెంచాం’’ అని పేర్కొన్నారు. తలసాని స్థాయి తగ్గించినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, లక్ష్యాలను సాధించడానికే వాణిజ్య పన్నుల శాఖను తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు.
 
 భలే ఐడియా..
 టీఆర్‌ఎస్ ప్లీనరీకి వచ్చిన వేలాది మంది కార్యకర్తలకు చల్లని మంచినీళ్లు అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్త ఆలోచన చేశారు. కేసీఆర్ చిత్రపటంతో ముద్రించిన బాటిళ్లను ప్లీనరీ కోసం ప్రత్యేకంగా తెప్పించారు. సభా ప్రాంగణంలో పెద్ద గొయ్యి తవ్వి, దానిలో టార్పాలిన్ పరిచి ఐస్ ముక్కలు వేసి వాటిపై బాటిళ్లను వేసి, వాటిపై మళ్లీ ఐస్ ముక్కలు వేశారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ భలే ఐడియా గురూ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

 ప్లీనరీలో ఆదిలాబాద్ అంబలి
 టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఆదిలాబాద్ అంబలి వేసవి తాపాన్ని తీర్చింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ప్లీనరీకి హాజరైన నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అంబలి అందించారు. సుమారు మూడు వేల లీటర్లకుపైగా ప్రత్యేకంగా తయారు చేసిన అంబలిని ప్లీనరీ ఆవరణలో అందజేశారు. స్వయంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శిబిరంలో కూర్చుని ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పర్యవేక్షించడం విశేషం.

 వేదిక వద్దకే కారు..
 టీఆర్‌ఎస్ ప్లీనరీ హాల్లోకి ప్రవేశించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కారు మాత్రం సభా వేదిక వద్దకు నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

 కేసీఆర్‌పై ప్రేమతో..
 టీఆర్‌ఎస్ ప్లీనరీలో వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన మనోహర్ అనే టీఆర్‌ఎస్ కార్యకర్త కేసీఆర్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ప్లీనరీకి వచ్చిన ఆయన తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాలు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించిన ఫొటోలను లామినేషన్ చేయించి, తన కోటు (చొక్కా)పై ధరించాడు. ప్లీనరీ ప్రధాన ద్వారం వద్ద నిల్చుని వాటితో ప్రదర్శన ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement