గుంటూరు : ఉత్తరాంధ్రలోని సేద్యపు నీటి రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ సీఎం చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు. ఏపీలోని 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్న విషయం గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అత్యధిక వర్షపాతం 1050 మి.మీ ఉత్తరాంధ్రలో కురుస్తున్నా.. అక్కడి జిల్లాల్లోని కోటిమంది ప్రజలు తాగునీరు, సాగునీరు సమస్యలతో అల్లాడిపోతూ, పొట్ట చేతబట్టుకుని లక్షలాదిమంది వలస బాట పడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి రంగంపై శ్రద్ధ చూపకపోవడమే అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, త్రాగునీరు కష్టాలను పరిష్కరించడానికి ఏకైక మార్గం 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును తక్షణం చేపట్టడమేనని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, పన్నెండు వందల గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చు. దానిని దృష్టిలో ఉంచుకునే అప్పటి ముఖ్యమంత్రి దివంగతనేత డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డిగారి దృష్టికి ఆ ప్రాజెక్టును తీసుకుని రాగా వెంటనే 2008 సంవత్సరంలో ఆయన పరిపాలనా అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ ప్రాజెక్టుకు సబ్బవరంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని గుర్తుచేశారు. అయితే ఆయన మరణానంతరం ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని లేఖలో పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కూడా 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ ప్రాజెక్ట్ పనులు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ప్రాజెక్ట్ పూర్తికావాలంటే 7500 కోట్లు అవసరం కాగా ఈసారి బడ్జెట్ లో 3 కోట్లు మాత్రమే కేటాయించారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి తక్షణమే ప్రాజెక్ట్ పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య తీరాలంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
ఉత్తరాంధ్రకు నష్టం చేస్తున్న ఒడిశా ప్రభుత్వం
ఒడిశా ప్రభుత్వ వైఖరి కారణంగా రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతుందన్నారు. న్యాయపరంగా కట్టుకుంటున్న సేద్యపు ప్రాజెక్టులకు అనేక అడ్డంకులను కలిగిస్తూ, అక్రమంగా ఆ రాష్ట్రంలో ప్రాజెక్టును నిర్మిస్తూ ఉత్తరాంధ్ర రైతాంగానికి ఒడిశా ప్రభుత్వం తీవ్ర నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉత్తరాంధ్ర రైతాంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబుకు మాజీ ఎంపీ కొణతాల లేఖ
Published Mon, May 23 2016 5:49 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement