నిడదవోలు (పశ్చిమ గోదావరి): అమెరికాలో ఉన్నత వర్గాల వారి ఇళ్లల్లో పని చేసేందుకు మహిళలు కావాలంటూ నమ్మబలికారు. వారి ఉచ్చులో పడిన సరూర్‌నగర్ మండలం జల్లెడగూడ గ్రామానికి చెందిన రజితను అమెరికాకు బదులుగా మస్కట్ పంపించారు. ఆమెను అక్కడి ఆసుపత్రిలో చేర్చి కిడ్నీలు తొలగించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఆ మహిళ అక్కడి వైద్యుల నుంచి తప్పించుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కొందరి సాయంతో సురక్షితంగా హైదరాబాద్ చేరింది. అనంతరం రంగారెడ్డి జిల్లా నూర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించే పనిలో పడ్డారు.
రజిత అనే మహిళను మస్కట్ పంపించడానికి మధ్యవర్తిత్వం నెరిపిన వ్యక్తి సాయంతో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదేకుర్రు గ్రామానికి చెందిన బుట్టా శ్రీనివాస్ అనే ఏజెంట్‌కు వలవేశారు. విమాన చార్జీల నిమిత్తం బాధితురాలు చెల్లించాల్సిన సొమ్ము తీసుకునేందుకు రావాల్సిందిగా ఏజెంట్‌కు ఫోన్‌లో సమాచారం ఇప్పించారు. ఆ సొమ్మును శనివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తీసుకొచ్చి ఇవ్వాలని కోరిన ఏజెంట్ శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన తన స్నేహితుడు యడ్ల సత్యతో కలసి మోటార్ సైకిల్‌పై నిడదవోలు చేరుకున్నాడు. అప్పటికే మధ్యవర్తిని వెంటబెట్టుకుని నిడదవోలులో మాటువేసిన నూర్‌పేట క్రైం బ్రాంచ్ ఎస్సై ఎస్.రామకృష్ణ, సిబ్బంది కలసి ఏజెంట్ బుట్టా శ్రీనివాస్, అతని స్నేహితుడు సత్యను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు.
కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Published Sat, May 28 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM
Advertisement