
కొండా రాఘవ రెడ్డి(ఫైల్)
► ప్రభుత్వ తీరుపై కొండా రాఘవరెడ్డి ఆగ్రహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం శాస్త్రీయత పాటించడం లేదని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంత చరిత్ర, నేపథ్యాన్ని చెరిపేలా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కొత్త జిల్లాతో వచ్చే సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపడం లేదని, అందరూ అధికారపార్టీ నేతలే కావడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారన్నారు.
ఆందోళనలు, ధర్నాలు చేస్తే ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందని... శాస్త్రీయత లేకుండా ఏర్పాటు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వికారాబాద్ జిల్లాలో నోటిఫికేషన్ లో పేర్కొన్న 19 మండలాలు తప్పకుండా ఉండాల్సిందేనని, లేకుంటే ఆ జిల్లా ఉనికికే కష్టమన్నారు.
స్వతంత్ర సమరయోధుడైన కొండా వెంకట రంగారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన జిల్లా స్వరూపాన్ని భంగపర్చేలా ప్రభుత్వ చర్యలున్నాయన్నారు. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక పద్ధతిగా ముందుకెళ్లాలని, గడియకోమారు మాట మారిస్తే ప్రజలు విశ్వసించరన్నారు.