ప్రాణం తీసిన పాటల సరదా
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఆటో
ఉప్పరపల్లి కారోబార్ మృతి, ఐదుగురికి గాయాలు
కేసముద్రం : ప్రయాణిస్తున్న ఆటోలో పాటలు వినేం దుకు డ్రైవర్ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేయబోగా అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడం తో ఓ వ్యక్తి మృతిచెందగా, ఐదుగురికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో ఉప్పరపల్లి రోడ్డుపై బుధవారం సాయంత్రం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కేసముద్రం(స్టేషన్)కు చెందిన జల్లంపల్లి మనోహర్, జల్లంపల్లి శ్రీను, జల్లంపల్లి చిన్నశ్రీను గూడూరు మండలంలో తీగలవేణిలో ఓ ఇంటికి పెయింటింగ్ వేసేందుకు వెళ్లారు. తిరుగుప్రయాణం లో గూడూరు నుంచి కేసముద్రం వైపునకు వస్తున్న ఆటో ఎక్కారు. ఉప్పరపల్లి రోడ్డు వద్దకు రాగానే ఉప్పరపల్లికి చెందిన కారోబార్ వీర బోయిన మురళి(36), కంది నవీన్ ఎక్కారు. తర్వాత ఆటో కేసముద్రంస్టేషన్ సమీపంలోకి వస్తుండగా డ్రైవర్ భట్టు నాగరాజు మ్యూజిక్ ప్లేయర్(డెక్) ఆన్ చేయడానికి కిందికి వంగాడు.
దీం తో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే తలకు తీవ్రగాయమైన మురళి మృతిచెందాడు. మనోహర్, చిన్న శ్రీను, శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా, నవీన్, నాగరాజుకు స్వల్పగాయాలయ్యాయి. తీవ్రం గా గాయపడ్డ వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించా రు. మురళి మృతితో భార్య స్వరాజ్యం, కూతురు అఖిల ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణిదర్ తెలిపారు.