ఆటో బోల్తా.. ఆరు నెలల పాప మృతి
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
చీరాల రూరల్ :
ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆరు నెలల పాప తల్లిదండ్రుల ఎదుటే ఆటో కిందపడి మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఈపూరుపాలెం చెక్‌పోస్టు వద్ద ఆదివారం జరిగింది. ఈపురూపాలెం ఎస్‌ఐ దాసరి ప్రసాద్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన చుక్క కృష్ణవేణి తన భర్త, ఆరు నెలల కుమార్తెతో కలిసి చీరాలలోని రామ్‌నగర్ వెళ్లేందుకు బాపట్ల నుంచి చీరాల వైపు వెళ్లే ఆటో ఎక్కింది.
ఆటో ఈపూరుపాలెం చెక్‌పోస్టు వద్దకు చేరగానే బైపాస్ మీదుగా బాపట్ల వెళ్తున్న బైకు లారీని తప్పించి ముందుకు వెళ్తూ కృష్ణవేణి దంపతులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణవేణి కుమార్తె ఆటో నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది చిన్నారిని చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.