భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న ,ఎస్పీ కోరాడ మధుసూధనరావు (ఫైల్)
♦ అనకాపల్లి ఎస్‌ఐ మధుసూదనరావు
♦ నాలుగు రోజుల కిందట రోడ్డు ప్రమాదం
♦ చికిత్స పొందుతూ మృతి
అనకాపల్లి టౌన్, పెదవాల్తేరు(విశాఖ తూర్పు) : ఉజ్వలంగా ప్రకాశించవలసిన దీపం మధ్యలోనే కొడిగట్టింది.. కుటుంబ సభ్యుల ఆశలను తుంచేసింది.. నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అనకాపల్లి పట్టణ ఎస్‌ఐ కోరాడ మధుసూదనరావు (40) విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈనెల 16వ తేదీన ఒక క్రైం కేసు దర్యాప్తు నిమిత్తం ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా ఎచ్చెర్ల మండలం కుశాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిపోయారు.
వెంటనే ఆయనను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి పరాజితుడు కావడం పోలీసు వర్గాల్లో విషాదం నింపింది. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె 6వ తరగతి, కుమారుడు 4వ తరగతి చదువుతున్నారు. ఇతని స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కోరాడపేట గ్రామం. 2009లో ఎస్‌ఐగా నియమితులైన మధుసూదనరావు శ్రీకాకుళం జిల్లాలో పొందూరు, బత్తిలి, సీసీఎస్ పోలీస్‌స్టేషన్లలో పనిచేశారు. అనంతరం పలాస జీఆర్‌పీ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ ఈఏడాది జూన్‌లో అనకాపల్లి పట్టణ ఎస్‌ఐగా బదిలీపై వచ్చారు.
ఎస్పీ నివాళి
ఎస్‌ఐ మధుసూదనరావు మరణవార్త తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ హుటాహుటిన ఆసుపత్రి వెళ్ళారు. అక్కడ వున్న అతని బంధువులను ఓదార్చి, భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్థిక సదుపాయాలు త్వరలో మంజూరు అయ్యేటట్లుగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఎస్పీతోపాటు అనకాపల్లి డీఎస్‌పి కె.వి.రమణ, సీఐ విద్యాసాగర్, పోలీసు అధి కారుల సంఘం అధ్యక్షుడు జె.వి.ఆర్.సుబ్బ రాజు, 2009 బ్యాచ్ ఎస్‌ఐలు, అనకాపల్లి పోలీసు సిబ్బంది భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.