నిర్లక్ష్యం తెగులు | nirlakshayam tegulu | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం తెగులు

Published Tue, Aug 23 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

నిర్లక్ష్యం తెగులు

నిర్లక్ష్యం తెగులు

కొవ్వూరు : వరి పంటకు నీటి తడులు అందక ఎక్కడికక్కడ ఎండిపోతోంది. పట్టించుకోని సర్కారు తీరుపై రైతన్న కడుపు మండుతోంది. నాట్లు వేసే దారిలేక గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టు పరిధిలో సుమారు 40 వేల ఎకరాలు బీడు వారాయి. గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతున్నా నాట్లు వేసిన చేలకు నీళ్లు అందటం లేదు. పచ్చని పశ్చిమ గోదావరిలో రైతుల దుస్థితి ఇది. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నా.. పంపిణీ కాలువలు, పంట బోదెల్లోకి వెళ్లడం లేదు. ఈ కారణంగానే కనీవినీ ఎరుగని రీతిలో డెల్టా రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని నీటిపారుదల శాఖ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.38 లక్షల హెక్టార్లలో (సుమారు 6 లక్షల ఎకరాలు) వరినాట్లు వేయాల్సి ఉండగా 2.23 లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. ఆగస్టు ¯ð ల ముగుస్తున్నా ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. 
కారణాలివీ
అధికారుల నిర్లక్ష్యం, లస్కర్లు లేకపోవడం, జిల్లా స్థాయి అధికారుల అవగాహనా లోపం వల్లే రైతులకు సార్వాలోనూ సాగునీటి కష్టాలు వచ్చి పడ్డాయని నీటి పారుదల నిపుణులు స్పష్తం చేస్తున్నారు. వారేమంటున్నారంటే...l ప్రధాన కాలువల కంటే పంపిణీ కాలువలు, పంట బోదెలు మెరకగా ఉండటంతో వాటి సామర్థ్యం మేరకు నీరు వెళ్లడం లేదు. 
l ప్రధానంగా పర్యవేక్షణ లోపం వల్ల నీటి ఎద్దడి అధికమైంది. ఏ పంపిణీ కాలువకు ఎంత నీరు ఇవ్వాలి, ఎంత ఇస్తున్నారు, నిర్దేశించిన ప్రాంతం వరకు సాగునీరు వెళుతోందా లేదా అనే దానిపై క్షేత్రస్థాయిలో సాగునీటి సంఘాలు, అధికారుల పర్యవేక్షణ ఉండటం లేదు.
l ఎగువ ప్రాంత రైతులు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా నీటిని వాడుకోవడం, తడులు అధికంగా పెట్టడంతో శివారు ప్రాంతాలకు నీరు పారడం లేదు.
l గోదావరిలో ఎర్ర నీటిని కాలువలకు విడిచిపెట్టినప్పుడు ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది. రబీ సీజన్‌లో నీరు స్వచ్ఛంగా ఉండటం వల్ల ప్రవాహ వేగం అధికమవుతుంది.
l అధికారులు, నీటిసంఘాల ప్రతినిధులు తమ పరిధిలోని కాలువకు కేటాయించిన నీరు సరఫరా అయ్యేంత వరకు పర్యవేక్షణ చేస్తేనే శివారు ప్రాంతాల వరకు నీరు చేరుతుంది.
l మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడం, తూడు పేరుకుపోవడం కూడా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. 
మొహం చాటేసిన వర్షాలు
మొదట్లో మురిపించిన వర్షాలు మొహం చాటేయడం కూడా రైతుల్ని దెబ్బతీస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 551.5 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 442 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అదికూడా కొద్దిరోజులే ఉంది. సాధారణ వర్షపాతం కంటే 19.9 శాతం తక్కువగా నమోదైంది. జూన్‌లో సరాసరి 114.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 276.8 మిల్లీమీటర్లు కురిసింది. 39 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు గంపెడాశతో ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమయ్యారు. తీరా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. జూలైలో 250.2 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 142.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఆగస్టులో 186.6 మిల్లీమీటర్లకు గాను కేవలం 22.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 88.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గడంతో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజులుగా జిల్లాలో 4 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత పెరిగింది. కొవ్వూరులో శనివారం గరిష్టంగా 37 డిగ్రీలు నమోదైంది. సోమవారం కొవ్వూరులో 36, నరసాపురంలో 35.7 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఉత్తర భారతంలోని బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో తేమతో కూడిన ఇక్కడి గాలులు అటువైపు వెళ్లిపోతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం తగ్గడం వల్ల ఉక్కపోత పెరుగుతోంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులకు తోడు ఎండలు మండిపోతుండటంతో పంటలకు సాగునీటి ఇబ్బందులు మరింత అధికమవుతున్నాయి.
పర్యవేక్షణ లోపంతోనే 
సాగునీటి సమస్య
 ప్రధాన కాలువల్లో నీరు సమృద్ధిగా ఉంటున్నా.. పంట కాలువలు, పంపిణీ కాలువలకు నీరు చేరకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వల్లే గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైతులు, అధికారులు, నీటి సంఘాలు సమన్వయంతో పనిచేయాలి. పంపిణీ కాలువల ద్వారా నీటిని పొలాలకు చేరేవిధంగా నిత్యం పర్యవేక్షించాలి. ప్రతి తూముపైనా పర్యవేక్షణ ఉండాలి.
– విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డు ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement