విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
ఉరవకొండ : వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా సరఫరా చేయకపోవడంతో మండలవ్యాప్తంగా బోరుబావుల కింద సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని ఇంద్రావతి, మోపిడి, రాకెట్ల, ఆమిద్యాల తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో అరటి, మామిడి, వేరుశనగ పంటలు ఎండుముఖం పట్టాయి.
బోరుబావుల కింద వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలను కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు పరిస్థితిని ఎన్నోమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఐదు గంటలైనా విద్యుత్ సరఫరా అయితే తప్ప తమ పంటలు చేతికందే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు.