తీర్మానం లేకుండానే బిల్లుల చెల్లింపు
రేగోడ్ : పంచాయతీ తీర్మానం లేకుండానే అధికారులు బిల్లులు చేస్తున్నారని సర్పంచ్ శామయ్య మండిపడ్డారు. మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. వచ్చే ఏడాది ఈసీఎస్ ద్వారా కూలీలకు ఏఏ పనులు చేపట్టాలనే విషయంపై చర్చించారు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలకు రోడ్లు, ఊటకుంటలు, కుంటల వంటి పనులు చేయాలని గుర్తించారు. గ్రామంలో గత వేసవిలో ట్యాంకర్ ద్వారా నీళ్ల సరఫరా చేశామని, బిల్లులు నేటికీ ఎందుకు మంజూరు చేయలేదని సర్పంచ్ అధికారులను నిలదీశారు.
ఈ క్రమంలో సర్పంచ్, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండానే అధికారులు ఇతరులకు బిల్లులు చేల్లిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు. గ్రామసభలో ఎంపీడీఓ బస్వన్నప్ప, ఏపీఓ జగన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణాచారి, ఫీల్డ్ అసిస్టెంట్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.