జన దీవెన
జన దీవెన
Published Fri, Jan 6 2017 10:41 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
రెండో రోజు భరోసా యాత్ర విజయవంతం
- మల్లన్న ఆశీర్వాదంతో ప్రారంభం
- దోర్నాల మీదుగా ఆత్మకూరుకు..
- దారి పొడవునా బారులుతీరిన ప్రజలు
- 140 కిలోమీటర్లు.. 10 గంటల యాత్ర
- అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. శుక్రవారం రెండు జిల్లాల్లో యాత్ర సాగడం విశేషం. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకున్న అనంతరం వైఎస్ జగన్ దోర్నాల మీదుగా ఆత్మకూరు చేరుకున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. దివంగత నేత వైఎస్‌ఆర్ విగ్రహాలకు నివాళులర్పించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యేలకు డబ్బులిస్తే అధికారంలోకి రారని.. ప్రజల అభిమానం గెలవాలని జగన్ చెప్పడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అదేవిధంగా మీకు రుణమాఫీ అయ్యిందా తెలపాలంటూ అడిగిన ప్రశ్నకు.. లేదంటూ చేతులు అడ్డంగా ఊపుతూ రైతులు తమ అభిప్రాయం తెలిపారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదన్నారు. ఇకపోతే దారి పొడవునా ముస్లిం నేతలు టోపీ ధరింపజేసి శాలువాతో సత్కరించారు. రైతు విభాగం నేతలు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి కండువా వేసి నాగలి బహూకరించారు. ఆత్మకూరు పట్టణంలో టాప్‌పై నిల్చొని రోడ్‌షో నిర్వహించారు. అంతకు ముందు ప్రకాశం జిల్లాలో సాగిన యాత్రలో ప్రధానంగా చింతలలోని చెంచులు కాగితపు పూలు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు.
మల్లన్నకు మొక్కులతో..
ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి శ్రీశైలానికి వచ్చిన వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వాచనాలు అందజేశారు. ఆలయ జేఈఓ హరినాథరెడ్డి శ్రీశైలాలయం చిత్రపటాన్ని బహూకరించారు. దర్శనానంతరం 11 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరిన జగన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు దోర్నాలకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి ప్రసంగించారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆత్మకూరుకు చేరుకున్నారు.ఽ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఆ తర్వాత స్మృతివనం చేరుకుని వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మొత్తం మీద రెండో రోజు రైతు భరోసా యాత్ర ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 140 కిలోమీటర్లు సాగింది.
ఇదీ మానవత..
ఆత్మకూరు పట్టణంలోకి భరోసాయాత్ర చేరుకోగానే ఓ అభిమాని వేగంగా వచ్చి కింద పడిపోయాడు. జీపులో నుంచి గమనించిన వైఎస్ జగన్ వెంటనే కిందకు దిగి అతని వద్దకు వెళ్లి జాగ్రత్త అంటూ పలకరించారు. ఆయనను లేపిన తర్వాత తిరిగి జీపులో కూర్చుని యాత్ర కొనసాగించారు. అదేవిధంగా దారిపొడవునా ప్రతి చోటా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రోడ్డుకు అడ్డంగా వచ్చి పలకరించారు. వారిని చూసిన జగన్.. ప్రేమగా కిందకు దిగి ఆత్మీయతను పంచారు. ఎలా ఉన్నారంటూ ఆరాతీశారు. పింఛన్లు రావడం లేదని, ఇళ్లు ఇవ్వలేదని, గిట్టుబాటు ధర రాలేదని పలువురు తమ బాధలను విన్నవించారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని, అధైర్యపడవద్దంటూ ధైర్య వచనాలు చెబుతూ ఆయన ముందుకు కదిలారు.
ఆకట్టుకున్న ప్రసంగాలు...!
ప్రాజెక్టులు వైఎస్ కడితే.. తానే కట్టినట్టుగా రైతాంగాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి, అధికార తెలుగుదేశం పార్టీ వైఖరి.. పాండవులు, కౌరవుల తీరు అంటూ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సవివరంగా తెలిపిన తీరు ప్రజలను ఆకట్టుకుంది. ఇక ఇంత మంది ప్రజాభిమానాన్ని ఎన్ని కోట్లు ఇస్తే కొనచ్చో తెలపాలంటూ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి స్వయానా తన సోదరుడు, పార్టీ మారిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. తాను ఇచ్చిన మాట మేరకు జగన్‌తోనే పయనిస్తానని హామీనిచ్చారు. ప్రజల అభిమానంతో గెలిచిన ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోవడం దుర్మార్గమని సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అంటేనే కరువని గౌరు చరిత అభివర్ణించారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, బుగ్గన రాజేనంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్ రెడ్డి, ఇన్‌చార్జీలు రాజగోపాల్ రెడ్డి, మురళీకృష్ణ, చెరుకులపాడు నారాయణ రెడ్డి, హఫీజ్‌ఖాన్, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, సురేందర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, తరిగొపుల భాస్కర్ రెడ్డి, ముంతల విజయభాస్కర్ రెడ్డి, గోవిందగౌడు, చౌడయ్య, అంబాల ప్రభాకర్ రెడ్డి, రాములమ్మ, డీకే రాజశేఖర్, సాయిరాం, లింగస్వామిగౌడ్, మద్దయ్య, వంగాల భరత్‌కుమార్ రెడ్డి, నరసింహులు యాదవ్, రాజా విష్ణువర్దన్ రెడ్డి, చంద్రమౌళి, నాగరాజు యాదవ్, పత్తికొండ మురళీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement