
జేఏసీని ముక్కలు చేసింది కోదండరామే
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ప్రొఫెసర్ కోదండరాం చేసిందేమీ లేదని, జేఏసీని ముక్కలు చేసి 99 జేఏసీలు చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. విద్యార్థుల వల్లే తెలం గాణ రాష్ట్రం సిద్ధించిందని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తన పక్కన ఉన్నవారికి, అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న కోదండరాం, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచించలేదన్నారు.
ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్లు ఇప్పిస్తానని విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోదండరాంతో ఉన్న వాళ్లంతా టీడీపీ, బీజేపీకి చెందిన విద్యార్థులేనన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి కూడా ఆంధ్రా నేతల పక్షాన చేరలేదా అని రవి ప్రశ్నించారు. ఏపీ నాయకుల మోచేతి నీళ్లు తాగి కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నారన్నారు.