
చాప్టా (కె) వీఆర్వో మాయాజాలం
♦ ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాల ఫోర్జరీ
♦ గుట్టురట్టయిన బాగోతం
♦ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తహసీల్దార్
కంగ్టి: వీఆర్వో మాయాజాలానికి రైతులు బలయ్యారు. భూమి యాజమాన్య హక్కు పత్రాలపై ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలతో రైతులకు పాస్‌బుక్‌లు పంపిణీకి సిద్ధం చేశాడు. అనుమానం వచ్చి సంతకాలను పరిశీలించగా గుట్టురట్టయింది. ఈ ఘటన కంగ్టి మండలంలో వెలుగుచూసింది. కంగ్టి మండలం చాప్టా(కె) క్లస్టర్‌లో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న నర్సింలు సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడు. తహసీల్ కార్యాలయం నుంచి పట్టాపాస్‌బుక్‌లు తీసుకొని ఆర్డీఓ సంతకాల కోసం తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో వాసర్ గ్రామం, తండాకు చెందిన రైతులు సుభాష్, సీతారాం, శ్రీరామ్, అంబుబాయి, జమలాబాయి, ఓంప్రకాష్, లక్ష్మయ్యల భూమి యాజమాన్య హక్కు పత్రాలపై బదిలీపై వెళ్లిన ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలు చేయించి తిరిగి కార్యాలయంలో సమర్పించాడు. సంబంధిత వాసర్ వీఆర్వో రాములు పరిశీలించారు. అనుమానం రావడంతో తహసీల్దార్ వసంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో అప్పటి ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలతో సరిపోల్చగా ఫోర్జరీ అని తేలిందని తహసీల్దార్ తెలిపారు. సదరు వీఆర్వో నర్సింలుపై చర్యలకు అనుమతి కోరుతూ బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నివేదిక పంపినట్టు తహసీల్దార్ వసంత్‌కుమార్ తెలిపారు.