'రేవంత్' కు చుక్కెదురు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, కొండంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. గతంలో బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించిన షరతులు సడలించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో కొడంగల్ నియోజకవర్గం దాటకూడదని హైకోర్టు ప్రధాన షరతు విధించిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీలో తను సీనియర్ నాయకుడినని, రాజధానిలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం ఉందని అందువల్ల బెయిల్ షరతులను సడలించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఏసీబీ తరఫు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రవికిరణ్‌రావు వ్యతిరేకించారు. రేవంత్‌రెడ్డిని నగరంలోకి అనుమతిస్తే దాని వల్ల దర్యాప్తు ప్రభావితం అవుతుందన్నారు. ఆరోగ్య కారణాలతో, కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు షరతుల సడలింపు కోరితే తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఇలాంగో షరతుల సడలింపు కోసం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.