CashForVote Case
-
'రేవంత్' కు చుక్కెదురు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, కొండంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. గతంలో బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించిన షరతులు సడలించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో కొడంగల్ నియోజకవర్గం దాటకూడదని హైకోర్టు ప్రధాన షరతు విధించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో తను సీనియర్ నాయకుడినని, రాజధానిలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం ఉందని అందువల్ల బెయిల్ షరతులను సడలించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఏసీబీ తరఫు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రవికిరణ్‌రావు వ్యతిరేకించారు. రేవంత్‌రెడ్డిని నగరంలోకి అనుమతిస్తే దాని వల్ల దర్యాప్తు ప్రభావితం అవుతుందన్నారు. ఆరోగ్య కారణాలతో, కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు షరతుల సడలింపు కోరితే తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఇలాంగో షరతుల సడలింపు కోసం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరో కథుంది!
తిరుపతి కల్చరల్: ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక అసలు కథ మరొకటి ఉందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ మంత్రులు తమకు హైదరాబాద్‌లో ఉన్న వెయ్యి ఎకరాల భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డు తగలడంతో దాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర పడిందన్నారు. కానీ టీడీపీ నేతలు ఏసీబీకి దొరికిపోవడంతో వారి నిజస్వరూపం బయట పడిందని చెప్పారు. ఏపీలో ఆగస్టు చివరికల్లా రాజకీయ సంక్షోభం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అధికార పార్టీ నాయకులే తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే చిత్తూరు, కడప జిల్లాలు అభివృద్ధి చెందడంతోపాటు లక్ష ఉద్యోగాలు వస్తాయని, అయినా ప్రభుత్వం దానిపై దృష్టి సారించడంలేదన్నారు. -
'జైలు నుంచి వచ్చిన రేవంత్ బెదిరిస్తున్నారు'
న్యూఢిల్లీ: 'ఓటుకు కోట్లు' కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏసీబీ వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్ సీఎం అంతుచూస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాక్షులను ఆయన బెదిరించే అవకాశముందన్నారు. 'ఓటుకు కోట్లు' కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారం దాగుందని ఆరోపించారు. స్టీఫెన్ సన్ కు ఇవ్వచూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈ దశలో రేవంత్ బయట ఉండడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందన్నారు.