రూరల్‌ పోలీస్‌ కనుమరుగు | Rural Police disappeared | Sakshi
Sakshi News home page

రూరల్‌ పోలీస్‌ కనుమరుగు

Published Tue, Sep 20 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

Rural Police disappeared

  • కమిషనరేట్‌ పరిధిలో 
  • హన్మకొండ, వరంగల్‌ జిల్లాలు
  •  సీనియర్లకు కొత్త జిల్లాల బాధ్యతలు
  • జిల్లా అధికారులతో  సమీక్ష నిర్వహించిన డీజీపీ  
  • సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో వరంగల్‌ రూరల్‌ పోలీసు విభాగం కనుమరుగు కానుంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి రూరల్‌ విభాగాన్ని తీసుకురావాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్, వరంగల్‌ రూరల్‌ పోలీసు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సోమవారం డీజీపీ అనుగార్‌శర్మ వీడి యో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. వరంగల్‌ డీ ఐజీ రవివర్మ, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు, వరంగల్‌ రూరల్‌ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఇ తర పోలీసు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 
    విస్తరించనున్న కమిషనరేట్‌
    వరంగల్‌ జిల్లాను వరంగల్, హన్మకొండ, జయశంకర్‌(భూపాలపల్లి), మహబూబాబాద్‌ జిల్లాలుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో వరంగల్‌ కమిషనరేట్, వరంగల్‌ రూరల్‌ పోలీసు విభాగాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న కమిషనరేట్‌ ప్రాంతా న్ని మినహాయించి మిగిలిన ప్రాంతాలకు రూరల్‌ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక భారంతో పాటు పాలన పరంగా చిక్కుముడులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. దీంతో రూరల్‌ ప్రాంతం మొత్తాన్ని కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో 19 సాధారణ పోలీస్‌ స్టేషన్లు, మూడు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌ స్టేషన్, ఒక క్రైం పోలీస్‌ స్టేషన్‌ ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్‌ స్టేషన్లు, మహిళా పోలీస్‌ స్టేషన్, క్రైం పోలీస్‌ స్టేషన్‌ ఉన్నాయి. త్వరలో ఈ రెండు విభాగాలు కలిసిపోనున్నాయి. అంతేకాకుండా కరీంనగర్‌ జిల్లాలోని ఐదు మండలాలు ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. ఈ ఐదు మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్‌ టౌన్, హుజూరాబాద్‌ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటికి కూడా వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో విలీనం కానున్నాయి. పోలీసుశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం అమలైతే వరంగల్‌ రూరల్‌ పోలీసు విభాగం కనుమరుగు అవుతుంది. పోలీసు శాఖ తాజా నిర్ణయంతో వరంగల్‌ కమిషనరేట్‌ పరిధి విస్తరించనుంది. కమిషనరేట్‌ పరిధిలో  20 లక్షలకు పైగా జనాభా ఉంది.
    కొత్త స్టేషన్లు నాలుగు..
    ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో కొత్తగా కాజీపేట, ఖిలావరంగల్, వేలేరు, చిల్పూరు, ఇల్లందకుంట, ఐనవోలు మండలాలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో ఖిలావరంగల్, కాజీపేట ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసు స్టేషన్లు ఉన్నాయి. దీంతో స్టేషన్లు లేని నాలుగు మండలాల్లో దసరా నాటికి కొత్త స్టేషన్లు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు బాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇవి ప్రారంభమైతే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి మొత్తం 76 పోలీసు స్టేషన్లు వస్తాయి. 
    ఎస్పీ క్యాంపునకు ఇబ్బందులు
    మహబూబాబాద్, జయశంకర్‌ (భూపాలపల్లి) జిల్లాలకు కొత్తగా పోలీసు శాఖ పరంగా ప్రత్యేక కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులకు సంబంధించిన భవనాల ఎంపిక, మౌలిక సదుపాయల కల్పనపై చర్చించారు. మహబూబాబాద్‌ ఎస్పీ ఆఫీసుగా ఐటీఐ భవనాన్ని, ఎస్పీ క్యాంపు ఆఫీసుగా పట్టణంలో ఓ అద్దె భవనాన్ని ఎంపిక చేశారు. ఇక జయశంకర్‌ జిల్లాలో మైనింగ్‌ ఓకేషనల్‌ సెంటర్‌ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చనున్నారు. ఎస్పీ క్యాంపు ఆఫీసుగా సింగరేణి అధికారులకు కేటాయించే ఎన్‌–ఏ టైపు క్వార్టర్‌ను ఇవ్వనున్నారు. సింగరేణి కమ్యూనిటీ హల్‌లో ఆర్ముడ్‌ రిజర్వ్‌ పోలీసు భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా రెవెన్యూ అధికారులు ఇదే భవనం కోసం పట్టుబడుతున్నారు. పాలనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా ప్రస్తుతం ఎస్లాబ్లిష్‌మెంట్‌ విభాగంలో సీనియర్‌ సిబ్బందిని కొత్త జిల్లాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement