మాట వినకపోతే బదిలీనే | tdp leaders hulchul in gudivada municipality | Sakshi
Sakshi News home page

మాట వినకపోతే బదిలీనే

Published Thu, Jun 9 2016 8:46 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

మాట వినకపోతే బదిలీనే - Sakshi

మాట వినకపోతే బదిలీనే

అధికారులపై తెలుగు తమ్ముళ్ల పెత్తనం
జాబితా తయారుచేస్తున్నామంటూ  హెచ్చరికలు
అన్ని శాఖల్లోనూ ఇదే తంతు
ఇదేం పాలన బాబోయ్ అంటున్న అధికారులు

 
గుడివాడ :  బదిలీల బూచీ చూపి తెలుగు తమ్ముళ్లు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. తాము చెప్పిన విధంగా నడవని వారి జాబితా తయారు చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే పైరవీలతో బదిలీపై ఇక్కడికి వచ్చిన అధికారులు ఇవేం బెదిరింపులని తలలు పట్టుకుంటున్నారు. నిజాయితీగా పనిచేయకపోతే బదిలీలు చేయించాలిగానీ ఇలా బెదిరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు అధికారులు, ఉద్యోగులకు అండగా నిలుస్తామని చెప్పిన దేశం నేతలు ఎన్నికలు అయ్యాక ఇలా ఉద్యోగులపై పెత్తనం చెలాయించడం దారుణమని మండి పడుతున్నారు.
 
 బరితెగించి బెదిరింపులు
 గుడివాడ మున్సిపల్ కమిషనర్‌ను రావి కోరిక మేరకు బదిలీ చేయించామని ఇటీవల జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు బహిరంగంగా ప్రకటించారు. ఆయన మాటలు అధికారులను బాధించాయి. దీనిపై ఇప్పటికే గుడివాడలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కాగా త్వరలో బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో గుడివాడలోని అధికార పార్టీ నాయకుడు ఆయా కార్యాలయాల్లో ఉన్న ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మాట విననివారు ఎవరున్నారు. వారి జాబితా ఇవ్వండని చెబుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ కార్యాలయం, పోలీసు, మున్సిపాలిటీ, ఎంపీడీవో ఇతర శాఖల్లో ఇదే విషయంపై చెప్పినట్లు సమాచారం.
 
 కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా, మరికొందరు అధికార పార్టీ నాయకుడుని కాకా పట్టేపనిలో ఉన్నారు.  ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే గుడివాడ మున్సిపాల్టీలో అధికారపార్టీ నేతల ఒత్తిడితో ముగ్గురు కమిషనర్లు, ఇద్దరు ఎంఈలు మారారు. అధికారులు ఎంతమంది మారినా తమ మాట వినడం లేదని, మున్సిపాల్టీలో ఈసారి భారీగా బదిలీచేసి తమ మాట వినేవారిని తీసుకు వస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులను ఎటువంటి ఇబ్బంది పెట్టమని చెప్పడంతో గుడివాడ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లలో 90శాతానికి పైగా టీడీపీకే ఓట్లువేసిన సంగతి గుర్తుచేస్తున్నారు. ఇలా అధికారం చేతిలో ఉందని ఉద్యోగుల్ని వేధిస్తే ఉద్యోగులలో తిరుగుబాటు తప్పదని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి హెచ్చరించారు.
 
 బదిలీలు అంటేనే భయమేస్తుంది
 బదిలీలు అంటేనే భయమేస్తోందని అధికారులు అంటున్నారు. ఎంత చేతిచమురు వదిలించుకోవాలో అని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టింగ్‌లకు భారీఎత్తున ఖర్చుపెట్టి వస్తుంటే ఇలా బెదిరించి బదిలీలు చేస్తే ఎలాగని మండిపడుతున్నారు. మంచి స్థానం దొరకాలంటే ఎంత ఖర్చు చేయాలో అని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement